మాక్లూర్, ఫిబ్రవరి 8 : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని వల్లభాపూర్ గ్రామంలో ని ప్రభుత్వ ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి 7వ తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతున్నది. గ్రామంలో చాలా మంది పిల్లలు ఉన్నా అంతా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేందుకు మొగ్గు చూపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో ప్రతి యే టా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వ చ్చింది. 2018-19 విద్యా సంవత్సరంలో 7 తరగతులకు కలిపి 8 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు. వారికి విద్యాబోధన చేసేందుకు ఆరుగురు ఉపాధ్యాయులు, అంటే ఒక్కో విద్యార్థికి ఒక్క టీచర్ అన్నమాట. ఇక బడి మనుగడే కష్టమనిపించింది. ఎక్కడ స్కూల్‌ను మూసి వేస్తారోనని గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. బడిని నిలబెట్టుకోవాలంటే ఇంగ్లిష్ మీడియం బోధన ఒక్కటే మార్గమని గ్రామస్తులు నిర్ణయించారు. అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. 2019 నుంచి ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించారు. చుట్టు పక్కల గ్రామాలకు వెళ్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించగా వారు స్థానిక పాఠశాలలో తమ పిల్లలను చేర్పించారు. ఎనిమిది మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా 80కి చేరింది.
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అనగానే ఏ ఒక్కరితోనే అది విజయవంతం కాదు. అది తెలుసుకున్న గ్రామస్తులు, వీడీసీ సభ్యులు, యువకులు, ఉపాధ్యాయుల సహకారంతో విజయం సాధించారు. ముందుగా పాఠశాల రూపురేఖలను మార్చారు. ప్రైవేటును తలదన్నేలా సౌకర్యాలు కల్పించారు. పాఠశాల ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటడంతో పచ్చదనం సంతరించుకున్నది. విద్యార్థులను ఆకట్టుకునేలా తరగతి గదిలోని గోడలకు పెయింటింగ్‌లు వేయించారు. ఆంగ్ల, తెలుగు వర్ణమాల, గణితం, సైన్స్, జంతువుల బొమ్మలు, దేశ, రాష్ట్ర పటాలను వేయించారు. ఉపాధ్యాయులు సైతం ఆంగ్లంలో బోధించడం మొదలు పెట్టారు.1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు ఇంగ్లిషు మీడియంలో బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
గ్రామస్తులు, దాతల సహకారం ఉపాధ్యాయుల కృషితో ఇంగ్లిష్ మీడియంలో బోధించడంతో వల్లభాపూర్ పాఠశాల రూపురేఖలు మారాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఇంగ్లిష్ మీడియం ప్రారంభం కానున్నది. మన ఊరు -మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక వసతులను మెరుగుపర్చనున్నది. వేలాది రూపాయల ఫీజులు కట్టాల్సిన పనిలేదు. సొంత గ్రామంలోనే ఇంగ్లిషు మీడియం చదువు అందుబాటులోకి వస్తుండడంతో తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ఎలాగైనా బడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గ్రామం నుంచి వెళ్తున్న పిల్లలు బడికి వచ్చేలా నిర్ణయించుకున్నాం. వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, పీఆర్టీయూ నాయకుల సహకారంతో 7వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన ప్రారంభించాం. ప్రభుత్వం తీసుకున్న మనఊరు- మనబడి కార్యక్రమంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
-రాధాకిషన్‌రావు, హెచ్ఎం