నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 2: శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శివాలయాలన్నీ మంగళవారం శివనామ స్మరణతో మార్మోగాయి. రాత్రి సమయంలో శివపార్వతుల కల్యాణం, నిశిపూజను వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం భక్తుల కోసం ఆలయ కమిటీలు, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కందకుర్తిలోని గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. బోధన్‌లోని చక్రేశ్వర ఆలయం వద్ద నిజామాబాద్ డీసీపీ వినీత్ శివాలయం చైర్మన్ సింగం భరత్‌యాదవ్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేసి రథయాత్రను ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాస దీక్షను విరమించారు. సిద్ధులగుట్టపై సుమారు 50వేల మందికి అన్నదానం చేశారు.
ఆలయంలో మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ముప్కాల్‌లోని పడిలేచిన మర్రిచెట్టు ఆలయం, కొత్తపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల వద్ద మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నందిపేట మండలంలోని కేదారేశ్వర ఆశ్రమంలో సుమారు 35 వేల మందికి అన్నదానం చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ భక్తులకు బొట్టుపెట్టి ఆశీర్వదించారు. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి శ్రీ ఉమామహేశ్వరాలయంలో నిర్వహించే ఐదు రోజుల కార్యక్రమాల్లో భాగంగా గ్రామ వీధుల్లో చిన్న రథోత్సవాన్ని నిర్వహించారు. లింగంగుట్టపై నిర్వహించిన యజ్ఞంలో సిద్ధేశ్వర మహరాజ్ పాల్గొన్నారు. నవీపేట మండలంలోని జన్నేపల్లి, రద్రూర్ మండలంలోని చిక్కడ్పల్లి, బోధన్ మండలంలోని సాలూరాలో నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి.
ఇజ్రాయిల్‌లోని తేల్ అవివ్ పట్టణంలో ఉన్న శివానంద ఆశ్రమంలో భార్గవి శివానంద ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సోమ రవి, ప్రతినిధులు గుగ్గిళ్ల దేవరాజ్, మహేశ్‌గౌడ్, సుల్లా నవీన్, సందీప్‌గౌడ్, విజ్జు, దేగాం సంతోష్, పిప్రి సాయన్న తదితరులు పాల్గొన్నారు.