నిజామాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎక్కువగా పసుపు పంటను సాగుచేస్తారు. కానీ ప్రస్తుతం పసుపు రైతులు ఇతర పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. దశాబ్దాలుగా పసుపు పంట సాగులో ఆరితేరిన రైతన్నలంతా ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా పసుపు పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి పోతున్నది. వానాకాలం సాగు అంచనాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది.
ఇందులో పసుపు సాగు కేవలం 20వేల 120 ఎకరాలకే పరిమితం కానున్నదని పేర్కొనడం గమనార్హం. ఒకప్పుడు 50వేల ఎకరాల్లో పండించిన పసుపు పంట ఇప్పుడు సగానికి కన్నా తక్కువకు పడిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆరుగాలం శ్రమించిన రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. 2024 వానకాలంలో 22వేల 941 ఎకరాల్లో పసుపు పంటను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. కేసీఆర్ పాలనలో పసుపు సాగు సుమారు 40వేల ఎకరాల వరకు కొనసాగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పసుపు రైతుల్లో నిరాశ అలుముకున్నది. ఇందుకు రైతుభరోసా లేకపోవడం, పసుపు పంటకు బోనస్ వర్తించకపోవడం, క్వింటాలు పసుపునకు సరైన మద్దతు ధర లభించకపోవడమే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ఎంతో ప్రసిద్ధి. అలాంటి పసుపు పంట కనుమరుగు అయ్యే ప్రమాదానికి నోచుకుంటుండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి.
జనవరి 14న సంక్రాంతి రోజున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో జాతీయ పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఊరూ పేరు లేకుండానే తాత్కాలిక సర్దుబాటుతో పసుపు బోర్డు నెలకొల్పినప్పటికీ గడిచిన నాలుగైదు నెలల్లో రైతులకు ధీమా కల్పించడంలో పసుపు బోర్డు చొరవ ఎక్కడా కనిపించడం లేదు. పసుపు ఆధారితర పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతున్నట్లు ప్రకటనలు విడుదల చేస్తున్నప్పటికీ సాగు ప్రోత్సాహకాలను మాత్రం అందివ్వడం లేదు.
జిల్లాలోని అంకాపూర్ గ్రామానికి చెందిన పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డుకు చైర్మన్‌గా కేంద్రం నియమించింది. బోర్డు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి భవానిశ్రీ బాధ్యతలు చేపట్టారు. పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత హోటళ్లలో స్టేక్ హోల్డర్లు, పసుపు ఆధారిత పరిశ్రమదారులతో సమావేశాలు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పసుపు సాగు పడిపోతుండడంపై పసుపు బోర్డు దృష్టి సారించకపోవడంతో రైతుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. సాగు విస్తీర్ణం పడిపోవడంతో ఉత్పత్తి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు పసుపు ఆధారిత పరిశ్రమలు స్థాపిస్తే ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పసుపు విస్తీర్ణం తగ్గుతున్నప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కనీసం చీమ కుట్టినట్లు కూడా స్పందించడం లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కారు సైతం పట్టించుకోవడం లేదు.
పసుపు పంటకు క్వింటాలుకు కనీసం రూ.15వేలు మద్దతు ధర కల్పించాల్సిన అనివార్యత ఏర్పడింది. తొమ్మిది నెలల పాటు సాగయ్యే పసుపు పంటపై రైతుల పెట్టుబడి ఎకరానికి దాదాపుగా రూ.లక్ష దాటుతున్నది. ప్రతి ఏటా కొత్త సంవత్సరం ప్రారంభంలో మార్కెట్‌కు పసుపును అమ్ముకునేందుకు వెళ్తే మద్దతు ధర లభించడంలేదు. అరకొరగా క్వింటాలుకు రూ.8వేల నుంచి రూ.10వేలలోపే మద్దతు ధర దొరుకుతోంది. దీంతో రైతులంతా నష్టాల బాట పడుతున్నారు. పసుపు పంటను సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో రైతులు నిట్టూరుస్తున్నారు. దీంతో గతిలేక ఇతర పంటల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు.
వానకాలంలో వరి పంట సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. సన్న రకం వరి సాగు చేసి రూ.500 అదనంగా బోనస్ దక్కించుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. పసుపు పంటకు సైతం బోనస్‌ను వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో క్వింటాలు పసుపునకు రూ.15వేలు కనీస మద్దతు ధర కల్పిస్తామంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ అమలును గాలికి వదిలేశారు.
తాము అధికారంలోకి వస్తే క్వింటాలు పసుపునకు రూ.12వేలు మద్దతు ధర అందిస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొనగా అమలుకు మోకాలడ్డుతోంది. ఇచ్చిన హామీలకు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పంగనామాలు పెట్టడంతో రైతులంతా చేసేది లేక ఇతర పంటలను సాగు చేయాల్సి వస్తోంది. తద్వారా ప్రసిద్ధమైన పసుపు పంట సాగు గణనీయంగా పడిపోవాల్సి వస్తోంది. పసుపు సాగు సీజన్ ఆరంభమవుతున్న ఈ సమయంలో ప్రభుత్వాలు కండ్లు తెరిచి రైతులకు బాసటగా నిలిస్తే పసుపు సాగు పెరిగే వీలుంది.
పసుపు సాగు చాలా క్లిష్టమైంది. సీజనల్‌గా వచ్చే తెగుళ్ల నుంచి పంటను సంరక్షించుకుంటూ 9నెలల పాటు సాగు కష్టాలు పడాల్సి వస్తుంది. ఎకరా పంట పెట్టుబడి రూ.లక్షన్నర దాకా అవుతోంది. పసుపు పంట అమ్ముకున్న తర్వాత రూ.లక్ష కూడా రావడం లేదు. నష్టాలు రావడంతో ఇతర పంటల వైపు దృష్టి పెట్టాల్సి వస్తోంది. పసుపు పంటకు రూ.500 బోనస్ కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
– కొండ అశోక్, పసుపు రైతు, కిసాన్‌నగర్, బాల్కొండ మండలం
జాతీయ పసుపు బోర్డు వచ్చింది. కానీ రైతులకు ఎలాంటి ప్రయోజనమైతే ఇప్పటి వరకు దక్కడం లేదు. పసుపు పంట సాగును ప్రోత్సహించే చర్యలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. పసుపు పంట సాగుతో నష్టాలు వస్తున్నాయి. ఏటా అప్పుల బారిన పడుతున్నాం. అందుకే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని నిశ్చయించుకున్నాం. గత సీజన్లో రెండెకరాల్లో పసుపు సాగు చేశా. పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఒక ఎకరానికే పరిమితం అవుతునున్నాను.
– రెంజర్ల మహేందర్, పసుపు రైతు, కమ్మర్పల్లి