చందూర్ : లక్ష్మీసాగర్ చెరువులో తమకు 60 శాతం వాటా ఉన్నప్పటికీ తమ వాటా ఇవ్వడం లేదని నిజామాబాద్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామస్తులు ధర్నాకు దిగారు. మంగళవారం ఉదయం చందూర్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
చందూర్ మండలంలోని లక్ష్మీసాగర్ చెరువులో 60 శాతం వాటా ఉందని.. అయినప్పటికీ గత మూడేండ్లుగా తమ వాటాను ఇవ్వకపోగా.. దొంగచాటుగా చేపలు పడుతున్నారని లక్ష్మాపూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆందోళన చేపట్టడంతో విషయం తెలుసుకున్న పోలీసులు చెరువు దగ్గరకు వచ్చి వారికి నచ్చజెప్పారు. విషయం సద్దుమణిగిందని అనుకునేలోపు ఉదయం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
రాస్తారోకో గురించి తెలిసిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని లక్ష్మాపూర్ గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామానికి వెళ్లి సంబంధిత అధికారులతో చర్చలు జరపాలని సూచించారు. ఏసీపీ సూచన మేరకు లక్ష్మాపూర్ వెళ్లిన ప్రజలు.. రచ్చబండ వద్ద సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా మత్స్య శాఖ ఏడీ ఆంజనేయులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులకు సరైన న్యాయం చేస్తామని, గ్రామస్తుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, ఆందోళన చేయవద్దని సూచించారు.