ఉమ్మడి జిల్లాలో చేప పిల్లల పంపిణీ లక్ష్యం..
నిజామాబాద్
చెరువుల సంఖ్య1,043
చేప పిల్లల పంపిణీ4. 85కోట్లు
కామారెడ్డి
చెరువుల సంఖ్య627
చేప పిల్లల పంపిణీ2.70 కోట్లు
ఫుల్లుగా వానలు.. దండిగా నీళ్లు.. జలాశయాలన్నీ కొత్త నీటితో కళకళలాడుతున్నాయి. చెరువులు, కుంటలు నిండిన తరుణంలో మరోమారు చేప పిల్లల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. త్వరలోనే తటాకాల్లో చేప పిల్లలు వదిలేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనవాళ్లు కోల్పోయిన చెరువులను పునరుద్ధరించిన సీఎం కేసీఆర్.. రైతుల క‘న్నీటి’ గోస తీర్చారు. అదే తరుణంలో జీవనమే దుర్భరంగా మారిన మత్స్యకారులకు చేయూతనిచ్చేలా చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఎన్నో ఏండ్లుగా చెరువులపై కొనసాగిన కొందరి గుత్తాధిపత్యానికి తెరదించిన ప్రభుత్వం.. మత్స్యకారులు రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఉచితంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభించింది. ఈ సంవత్సరం కూడా చేప విత్తనాలను సరఫరా చేయనున్నది. ఉమ్మడి జిల్లాలోని 1,670 చెరువుల్లో 7.55 కోట్ల చేప పిల్లలను వదిలేలా సన్నాహాలు చేపట్టింది. గతంలో జరిగిన లోటుపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది.
నిజామాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నీటి వసతి కలిగిన చెరువుల్లో ఉచితంగా చేపలను వదిలేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. మత్స్య శాఖ అధికారులు ప్రస్తుత సీజన్‌కు సంబంధించి అనువైన నీటి వనరులను గుర్తించారు.
చేప విత్తన సరఫరాకు ప్రణాళికను రూపొందించారు. ఈ ఏడాది కూడా మత్స్యకారులు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే చేపలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల పెంపకానికి సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం జిల్లా మత్స్య శాఖ పంపిన ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం లభించింది.
గతేడాది జరిగిన లోటుపాట్లకు తావు లేకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నాణ్యమైన చేప పిల్లలను గుర్తించి, శాస్త్రీయ పద్ధతిలోనే చెరువుల్లో చేప పిల్లలను వదలాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలో ఈసారి చెరువుల సంఖ్యను పెంచారు. 2022-23 సంవత్సరానికి మొత్తం 1043 జలాశయాల్లో 4కోట్ల 85 లక్షల చేప పిల్లలను వదలాలని నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాలో 627 చెరువుల్లో 2కోట్ల 70లక్షల చేప పిల్లలు వదిలేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానున్నది.
స్వరాష్ట్రం సిద్ధించేందుకు ముందు వరకు రాష్ట్ర వ్యాప్తంగా దుర్భిక్ష పరిస్థితులు. కాలం కలిసి వస్తుందా? అనుకుంటూ రైతులంతా మొగులు వైపు చూసేవారు. సాగుకు నీళ్లు లేకపోయేది. చెరువులు బేల చూపులు చూసేది. ఇటు సాగుతో పాటు జలాశయాలపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు అనేకం కకావికలం అయ్యాయి. ఆనాడు సమైక్య పాలకులు వృత్తిదారుల కష్టాలను పరిష్కరించే వారు కాదు.
స్వరాష్ట్రంలో నీటి గోసకు అనతి కాలంలోనే తిప్పలు తప్పడంతో గ్రామాల్లో మత్య్స సిరి విరాజిల్లుతున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలో భాగంగా చెరువులు, కుంటలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో చేప పిల్లల పెంపకానికి మత్య్సకారులను ప్రోత్సహించారు. 100 శాతం రాయితీతో చేప పిల్లల విత్తనాన్ని అందించడం ద్వారా వారికి కొండంత భరోసాగా నిలిచారు.
ఫలితంగా గ్రామాల్లో మత్స్యకారులకు ఎన్నడూ లేని విధంగా ప్రభు త్వం నుంచి అండ లభించింది. బాగుపడిన చెరువుల్లో జల సవ్వడులు కనిపిస్తుండడంతో మత్స్య అభివృద్ధి సాధ్యమైంది. 2022 వానకాలం ప్రారంభం నుంచి దంచి కొట్టిన వానలతో చెరువులన్ని సమృద్ధిగా నీటి నిల్వతో తొణికిసలాడుతుండడంతో చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చెరువులు, కుంటలకు కొదవ లేదు. మత్స్య అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతంగానూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం అన్ని చెరువుల్లోనూ నీళ్లు పుష్కలంగా ఉండడంతో చేప పిల్లల పెంపకానికి మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1670 జలాశయాల్లో 7కోట్ల 55 లక్షల చేప పిల్లలు వదలనున్నారు.
ఇప్పటికే టెండర్ ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. నిర్ణీత సైజుల్లో చేప పిల్లలను గుత్తేదార్లు ప్రభుత్వానికి అప్పగిస్తే అధికారికంగా త్వరలోనే కార్యక్రమం ప్రారంభం కానున్నది.
నిజామాబాద్ జిల్లాలో 249 మత్య్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా ఇందులో 16,826 మంది సభ్యులున్నారు. కామారెడ్డి జిల్లాలో 147 మత్స్య సహకార సంఘాలున్నాయి. వీటిలో 13,170 మంది సభ్యులు ఉన్నారు. జల సిరులు అంతటా ఉండడంతో ఈసారి కాసింత అనుకూలతలు ఏర్పడ్డాయి.
ఉమ్మడి జిల్లాలో అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం తో అక్రమాలు ఏటా వెలుగు చూస్తున్నాయి. ఈ అంశంపై పలు మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు సంబంధిత శాఖ మంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. విచారణ సైతం జరిగింది. గతంలో తప్పు చేసిన అధికారులు, గుత్తేదార్లకు ప్రభుత్వం గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి తప్పులు పునరావృతం కావొద్దని చెప్పడంతో పారదర్శకతకు పెద్ద పీట వేసే విధంగా చర్యలు పడుతున్నది.
కాంట్రాక్టర్లతో కొమ్ము కాస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఈసారి నిఘాను ఏర్పాటు చేయనున్నది. నిర్ధిష్ట ప్రమాణాలతో కూడిన చేప పిల్లలను సరఫరా చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు పంపించి వివరణ అడగడం, అంతేకాకుండా తప్పు చేస్తే బ్లాక్ లిస్టులో పెట్టేందుకు సర్కారు యోచిస్తున్నది. ఈ వ్యవహారంలో మత్స్య శాఖ అధికారుల పాత్ర ఉన్నట్లుగా ఆధారాలు లభిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కారు సిద్ధంగా ఉంది.
వాస్తవానికి కాంట్రాక్టర్లు బ్రీడర్ విత్తనాలను ఒకటి, రెండు చెరువుల్లో పెంచి వాటి పెరుగుదలను గమనించాల్సి ఉంటుంది. తర్వాత వాటి సహాయంతో విత్తును ఉత్పత్తి చేయించి పంపిణీ చేయాలి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇటువంటివేమీ చేయకుండానే అందుబాటులో ఉన్న నాణ్యతలేని వాటిని అంటగడుతున్నారని ఆరోపణలున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జలాశయాల్లో చేప పిల్లలను వదిలేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. చేప పిల్లలకు మత్స్యకారులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగానే ప్రభుత్వమే చేప పిల్లలను అందిస్తుంది.
చేపలను సరఫరా చేసేందుకు టెండర్ల ప్రక్రియను దాదాపుగా పూర్తి కావొచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చేప పిల్లలను లక్ష్యాలకు అనుగుణంగా ఆయా జలాశయాల్లో వదులుతాం. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.
– ఆంజనేయ స్వామి, మత్స్య శాఖ అధికారి, నిజామాబాద్ జిల్లా