నిజామాబాద్ క్రైం, జూలై 25: కష్టపడి చదివితే ప్రభుత్వ ను సొంతం చేసుకోవచ్చని, మీ భవిష్యత్తుకు మీరే మార్గ నిర్దేశకులని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మూడు నెలల పాటు పోలీసు, గ్రూప్స్ ఉద్యోగ పరీక్షల అభ్యర్థుల కోసం నిర్వహించిన ఉచిత శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మంత్రి వేముల, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంయుక్త ఆధ్వర్యంలో, అధికార యంత్రాంగం సహకారంతో ప్రీ రిక్రూట్మెంట్ పోలీస్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసి ఉద్యోగ నియామకాల్లో స్థానికత జీవోను అమల్లోకి తెచ్చిన ఘనుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో యువతకు ఇది వరంగా నిలవనున్నదని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన యువతకు సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు రావాలనే ఆకాంక్షతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా హైదరాబాద్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా స్థానికంగానే అన్ని వసతులతో కూడిన ఉచిత శిక్షణ ఇప్పించామని అన్నారు.
ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, యువత మేలుకోరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులమంతా ప్రీ కోచింగ్ ఏర్పాటు చేయించామని స్పష్టం చేశారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాము చేయాల్సిందంతా చేశామని, ఇక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అభ్యర్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఏకకాలంలో 90వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో సహసోపేత నిర్ణయమని కొనియాడారు. ఇప్పటికే 17వేల పైచిలుకు ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని మంత్రి గుర్తుచేశారు.
నిరుద్యోగ యువకులు అన్ని పోటీ పరీక్షలు రాసేందుకు వీలుగా ఒకదానివెంట ఒకటి చొప్పున నిర్ణీత కాలవ్యవధిలో నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని అన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జిల్లాకు పేరు తేవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నగర మేయర్ దండు నీతూకిరణ్ మాట్లాడుతూ అభ్యర్థులు పట్టుదలతో చదివి సర్కారు ఉద్యోగాలు సాధించాలన్నారు. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు మాట్లాడుతూ నాలుగేండ్లుగా సర్కారు దవాఖాన వద్ద సుమారు 15లక్షల మందికి భోజనం పెట్టిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని కొనియాడారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు లైబ్రరీలో నిత్యం భోజనం ఏర్పాటు చేస్తున్నారన్నారు. అనంతరం అభ్యర్థులకు మంత్రి వేముల, ఎమ్మెల్యే, సీపీలు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, టీఆర్ఎస్ నాయకుడు తారిక్ అన్సారీ, డీసీపీ అరవింద్‌బాబు, అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, ఏసీపీ వెంకటేశ్వర్, ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత మారయ్యగౌడ్, కాకతీయ విద్యాసంస్థల ప్రతినిధి రజనీకాంత్ పాల్గొన్నారు.
రైతు నాయకుడు స్వర్గీయ సురేందర్రెడ్డిలాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతున్నారు. జిల్లా అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు తగ్గట్టుగా కేటీఆర్ ఏ విధంగా పనిచేస్తున్నారో అదే విధంగా సురేందర్ రెడ్డి అడుగుజాడల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి నడుస్తున్నారు.
– దాదన్నగారి విఠల్‌రావు, జడ్పీ చైర్మన్
మన జిల్లాకు చెందిన యువతకు రెండు వేల ఉద్యోగాలు రావాలనే సంకల్పంతో నేతలు కృషి చేస్తున్నారు. దీని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగం సాధించేందుకు కష్టపడాలి. పెద్దల సహకారాన్ని వమ్ము చేయకుండా ఉద్యోగాలు సాధించాలి. గతంలో 40 ,45 సంవత్సరాలు పాలించిన ఏ ప్రభుత్వం ఇలాంటి ప్రోత్సాహం అందించలేదు. ఈ ఘనత కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది.
– ఎమ్మెల్సీ వీజీగౌడ్
మా అందరికీ ప్రొఫెసర్ సీఎం కేసీఆర్ సార్. సామాన్య,పేద ప్రజలకు ఎలా సేవలందించాలి? రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పల్లెలను ఎలా తీర్చిదిద్దాలనే విషయాలను సార్ చెబుతారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనే ఆకాంక్షతో మంత్రి వేముల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించడం గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ కష్టపడి ఉద్యోగాలు
సాధించాలి.
– మహ్మద్ షకీల్, ఎమ్మెల్యే, బోధన్
అభ్యర్థులకు ఉచిత శిక్షణ విషయమై అడిగిన వెంటనే మంత్రి వేముల అంగీకరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రీ కోచింగ్ నిర్వహించాలని సీఎం కేసీఆర్, డీజీపీ ఆదేశించారు. రూ.25లక్షలు బడ్జెట్ అవుతుందని చెప్పగానే మంత్రి ఏమాత్రం వెనుకాడలేదు. అభ్యర్థులు పట్టుదలతో పరీక్షలు రాసి ఉద్యోగం సాధించాలి.
– కేఆర్ నాగరాజు, కమిషనర్ ఆఫ్ పోలీస్, నిజామాబాద్