కోటగిరి/బాల్కొండ/నిజామాబాద్ రూరల్, జూలై 25: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. పరిసరాల పరిశుభ్రత, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కోటగిరి మండలంలోని కొల్లూర్, ఎత్తొండ, హెగ్డోలి, కోటగిరి గ్రామాల్లో వైద్యారోగ్య సిబ్బంది సోమవారం ఇంటింటికీ తిరిగుతూ సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత, దోమతెరల వినియోగంపై అవగాహన కల్పించారు. వైరల్ ఫీవర్‌పై సర్వే చేశారు. గర్భిణులకు రక్తహీనత, ప్రభుత్వ దవాఖానలో నార్మల్ డెలివరీలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి, సిబ్బంది జ్యోతి, సాయికుమారి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించి దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేశారు. కార్బన్ వచ్చి వీధి దీపాలు వెలగని వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం గ్రామంలో దోమల నివారణ కోసం ఫాగింగ్ యంత్రాన్ని కొనుగోలు చేశామని సర్పంచ్ లక్ష్మణ్‌రావు, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి తెలిపారు. రూ.42వేల గ్రామ పంచాయతీ నిధులతో యంత్రాన్ని కొనుగోలు చేసి అన్ని కాలనీల్లో ప్రతిరోజూ ఫాగింగ్ చేయిస్తున్నామని చెప్పారు.
ఏర్గట్ల, జూలై 25: మండల కేంద్రంలోని గ్రామ పంచా యతీలో పారిశుద్ధ్య సిబ్బందితో ఎంపీవో శివచరణ్ సోమ వారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజూ బ్లీచింగ్ పౌడర్, సున్న కలిపి మురికి కాలువల్లో చల్లాలని అన్నారు. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి గుంతల్లో దోమల లార్వాలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలోని ప్రజలకు వేడి చేసి చల్లార్చి వడపోసుకొని నీటిని తాగేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పంచాయ తీ కార్యదర్శి జాకీర్, కారోబార్లు తదితరులు పాల్గొన్నారు.