ఏర్గట్ల, జూలై 25 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలను నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.సోమవారం ఆయన ఏర్గట్ల మండలంలోని దోంచంద గ్రామంలో పర్యటించారు. భారీ వర్షాలకు కోతకు గురైన భూములు, దెబ్బతిన్న పంటలను రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
పంట నష్టం వివరాలను రైతులతోపాటు అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మండల కేంద్రం నుంచి కమ్మర్‌పల్లికి వెళ్లే రోడ్డులో కోతకు గురైన పది బొంగుల వంతెన, జగిత్యాల జిల్లాకు వెళ్లే రోడ్డులో ఏర్గట్ల శివారులో ఉన్న తీగల వాగు బ్రిడ్జిని పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన వంతెనల పూర్తి వివరాలను తనకు నివేదిక రూపంలో అందజేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి వెంట ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ జనార్దన్, ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, మండల వ్యవసాయాధికారి మహ్మద్ అబ్దుల్ మాలిక్, విండో చైర్మన్లు పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి, బర్మ చిన్న నర్సయ్య, సర్పంచులు గద్దె రాధ, పద్మ, ట్రాన్స్‌కో అధికారులు ఉన్నారు.