నిజాంసాగర్, జూన్25: నిజాంసాగర్ నీటిని ఆయకట్టు రైతులు వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. శనివారం సాయంత్రం నిజాంసాగర్ నీటిని ప్రధాన కాలువ గేట్ల ద్వారా విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.13 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. అలీసాగర్ వరకు 1.35లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు మొదటి విడుతగా నీటిని విడుదల చేశామని తెలిపారు. ఆయకట్టు కింద అలస్యంగా నాట్లు వేసుకునే వారికి, ముందే నాట్లు వేసుకునే వారికి అవసరాల కోసం 20రోజుల పాటు నీటి విడుదల కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ వరకు మొత్తం ఆరు విడుతల్లో విడుదల చేస్తామని చెప్పారు.
ఆయకట్టు అవసరాల కు అనుగుణంగా పది రోజుల పాటు నీటి విడుదల నిలిపివేసి మళ్లీ ఆన్ ఆఫ్ పద్ధతిలో విడుదల చేస్తామని వివరించారు. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్, కోటగిరి, చందూర్, మోస్రా, వర్ని, మండలాలతో పాటు బోధన్ నియోజకవర్గ రైతన్నలు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నీటి విడుదల పక్కాగా కొనసాగేందుకు రెవెన్యూ, పోలీసు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు.
20 రోజుల పాటు నీటి విడుదల ఉంటుందని, నాట్లు వేసుకోని వారు త్వరితగతిన వేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసుకున్నామని, ఆయకట్టు రైతుల తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, రైతుబంధు సమతి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, ఈఈ సోలోమాన్, డీఈ శ్రావణ్‌కుమార్, సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, గంగారెడ్డి, మనోహర్, రమేశ్‌గౌడ్, వాజిద్, శ్రీధర్, ఎజాస్తో పాటు నిజాంసాగర్, బాన్సువాడ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.