బాన్సువాడ టౌన్, జూన్ 25: పోటీ పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఆకాంక్షించారు. శిక్షణ పూర్తయినా పరీక్ష రాసేవరకూ చదువుతూ ఉండాలని సూ చించారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఏర్పా టు చేసిన ఉచిత శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక మీనా గార్డెన్ లో ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ఉద్యోగార్థులు శిక్షణ కోసం ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు రెండు ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
శనివారం నాటికి 63 రోజుల శిక్షణ తరగతులు పూర్తయినట్లు చెప్పారు. ఉత్తమ ఫ్యాకల్టీనీ పంపి శిక్షణకు సహకారం అందించిన పీజేఆర్ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ శిక్షణ పూర్తయినా పోటీ పరీక్షలు రాసేవరకూ వరకు సాధన కొనసాగించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఒక దాని తరువాత మరొకటి చొప్పున ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారని, పట్టుదలతో సాధన చేసి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. ఇక్కడ 63 రోజుల పాటు తీసుకున్న శిక్షణ మీ 60 ఏండ్ల జీవితానికి పునాది కావాలన్నదే ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు ప్రధాన లక్ష్యమన్నారు.
కోచింగ్ సెంటర్ నిర్వహణలో ప్రధాన భూమిక పోషించిన ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన నర్సింహా రెడ్డి, ప్రశాంత్, ప్రవీణ్ కుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ గుప్తా, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, బుడిమి సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్, మాజీ ఎంపీపీ ఎజాస్, కో-ఆప్షన్ సభ్యుడు అలీ మొద్దీన్ బాబా, సభాపతి వ్యక్తిగత సహాయకుడు భగవాన్ రెడ్డి, మండల నాయకులు గోపాల్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.