సీఎం కేసీఆర్ మహా సంకల్పంతో ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో నిర్మించుకున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దేశ నిర్మాణంలో సివిల్ ఇంజినీర్ల భాగస్వామ్యం గొప్పదన్నారు. తాను సివిల్ ఇంజినీరింగ్ చదువుకున్న కర్ణాటక రాష్ట్రం బీదర్‌లోని భీమన్న కాండ్రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బీకేఐటీ)లో శనివారం జరిగిన అలూమ్ని – 2022 కార్యక్రమంలో వేముల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలేజీ రోజులను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.
కమ్మర్పల్లి, జూన్ 25: ప్రపంచంలో అతి పెద్ద మల్టీ లెవెల్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో సీఎం కేసీఆర్ మహా సంకల్పంతో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్టణంలో తాను సివిల్ ఇంజినీరింగ్ చదువుకున్న బీకేఐటీ (భీమన్న కాండ్రే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో శనివారం జరిగిన అలూమ్ని -2022లో వేముల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 1984 నుంచి 88 వరకు ఆ కళాశాలలో చదివి, అదే కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి మం త్రి హాజరుకాగా, తాను చదువుకున్న రోజులను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.
కళాశాల ఫౌండర్, చైర్మన్ బీమన్న ఖండ్రే ఆప్యాయత, ప్రోత్సాహం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చిన్న పిల్లాడిలా మురిసిపోయారు. తాను ఉండే బాయ్స్ హాస్టల్లో 108 నంబరు గ ది వద్ద ఫొటోలు తీసుకొని సంబుర పడ్డారు. ఈ సం దర్భంగా తాను చదువుకున్న బీకేఐటీ కళాశాలకు మంత్రి వేముల రూ.10 లక్షల డొనేషన్ ప్రకటించారు.
బాల్కిలో తాను అద్దెకు ఉన్న ఇల్లు బుల్లా హౌస్‌కు మంత్రి వేముల సడెన్‌గా వెళ్లి అక్కడ ఉన్న తన స్నేహితుడికి సర్ప్రైజ్ ఇచ్చారు. తనను గుర్తు పట్టవా అని 30 ఏండ్ల కింద కలిసిన స్నేహితుడిని అడగ్గానే ..ప్రశాంత్ అంటూ స్నేహితుడు మంత్రిని ఆనందంగా గుండెలకు హత్తుకున్నాడు. అప్పటి బాకీ ఏమన్నా పెండింగ్ ఉందా..ఇచ్చి పోతా అని మంత్రి నవ్వులు పూయించారు.
కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు ఉన్న అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలకు చెందిన విద్యార్థులతో బీకేఐటీ ఒక మినీ ఇండియాలా ఉంటుందని మంత్రి వేముల అన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.రూరల్ ఇంజినీరింగ్ మనుగడలో ఉన్న కాలంలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌ను అందుబాటులోకి తెచ్చిన ఘనత ఈ కళాశాలది అన్నారు. తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న గొప్ప పథకం మిషన్ భగీరథ అని పేర్కొన్నారు. తాను సివిల్ ఇంజినీర్‌ను కాబట్టే ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో సీఎం కేసీఆర్ తనను భాగస్వామ్యం చేశారని తెలిపారు. బాల్కి ఎమ్మెల్యే ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ.. మంత్రి వేముల సీఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడని అన్నారు. మిషన్ భగీరథకు వైస్ చైర్మన్‌గా పని చేసి, రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా పని చేస్తున్నారన్నారు. మంత్రి వేములకు బీకేఐటీలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మంత్రి బీకేఐటీ వ్యవస్థాపకుడు బీమన్న ఖండ్రేను ఇంట్లో మర్యాద పూర్వకంగా కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.