డిచ్పల్లి, జూన్ 25 : ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడాలంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లే దిక్కు. నిరుద్యోగులు నానా తిప్పలు పడేవారు. తిండీతిప్పలు ఉండేవి కావు. ఇరుకు రూముల్లో ఐదారుగురు కలిసి చదువుకునేవారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పెట్టే ఫీజు తిప్పలు అన్నీఇన్నీ కావు. నానా హైరానా పడి సర్కారు కొలువు కొట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ సర్కారు రెండోసారి కొలువుదీరాక పరిస్థితులను పూర్తిగా మార్చివేసింది.
ఏకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిరుద్యోగులకు కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇదే కోవలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద ఉన్న ఏడో పోలీస్ బెటాలియన్ ప్రాంగణంలో టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ పర్యవేక్షణలో ఉచిత కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు.
ఉచిత కోచింగ్ సెంటర్లో ప్రవేశాలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 1500మంది దరఖాస్తు చేసుకోగా వారిలో నుంచి 300మంది ఉద్యోగార్థులను ఎంపిక చేశారు. వారికి అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ద్వారా శిక్షణ ఇస్తున్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో పోటీ పరీక్షల పుస్తకాలను తయారు చేయించి పంపిణీ చేశారు.
కేంద్రానికి వచ్చే అభ్యర్థులకు నిత్యం మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించారు. కోచింగ్ సెంటర్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ చూస్తున్నారు. నిర్వహణలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బెటాలియన్ కమాండెంట్ సత్యశ్రీనివాస్‌రావు పటాలం సిబ్బందిని ఆదేశించారు.
ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నవారి మనసులో సాధారణంగానే ఏదో బెంకు ఉంటుంది. దానిని తొలగించేందుకు కోచింగ్ సెంటర్లలో అప్పుడప్పుడు ప్రముఖులతో పరిచయాలను ఏర్పాటు చేస్తుంటారు. అదే మాదిరిగా వచ్చే నెలలో పలువురు ప్రముఖులను ఈ కేంద్రానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై మొదటి వారంలో సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాల లత రానున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు. ఇతర సైకాలజీ నిపుణులను కూడా రప్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మేము ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని ఈ కోచింగ్ సెంటర్ నింపుతున్నది. కోచింగ్‌లో మోటివేషన్ బాగున్నది. అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు. ఇంత సహాయం చేస్తూ, మా భవిష్యత్తు బాగుండాలని చూస్తున్న వారందరికీ కృతజ్ఞతలు.
-ఆర్.మంజుల, నవీపేట్
కోచింగ్ సెంటర్లో ఏర్పాట్లు బాగున్నాయి. కోచింగ్ కోసం వస్తున్న మా అందరినీ ఇక్కడి అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లతో పోల్చుకుంటే ఇక్కడే చాలా బాగున్నది. ఏ లోటూ లేకుండా బోధిస్తున్నారు.
-ఎస్. స్వప్న, జక్రాన్‌పల్లి
బాజిరెడ్డి జగన్ సార్ పర్యవేక్షణలో సాగుతున్న కోచింగ్ సెంటర్‌తో మాకు ఇప్పటి వరకు తెలియని విషయాలు తెలిశాయి. ఇక్కడ ఇచ్చిన పుస్తకాలను చూశాక ఇంకా చదవాలనే ఆశ పుట్టింది. వీటి ద్వారా వంద శాతం ఉద్యోగం సాధించేందుకు అవకాశం ఉన్నది.
-జి. గౌతమి, ఇందల్వాయి
బాజిరెడ్డి గోవర్ధన్ సార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ ఫ్రీ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం, మాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ చాలా బాగుంది.
-బి.నవ్యశ్రీ, డిచ్పల్లి
ఫ్యాకల్టీ చెబుతున్న తరగతులతో ఇంకా చదవాలనే ఉత్సాహం వస్తున్నది. ఇక్కడికి వచ్చాకే చాలా విషయాలు తెలుసుకున్నాం. ఫ్యాకల్టీ కూడా బాగున్నది. అన్ని విషయాలను కూలంకషంగా చర్చిస్తారు. ఉద్యోగం సాధిస్తామన్న నమ్మకం కలుగుతున్నది.
-ఇందూరి ప్రసాద్, గన్నారం
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. అభ్యర్థులు కష్టపడి చదివి సర్కారు కొలువును సాధించాలి. ఉచితంగా అందిస్తున్న ఈ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి. 60 రోజుల కోచింగ్‌ను 60ఏండ్ల జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఓ మెట్టుగా ఉపయోగించుకోవాలి.
-బాజిరెడ్డి జగన్మోహన్, ధర్పల్లి జడ్పీటీసీ