కామారెడ్డి, జూన్25: జిల్లాలో 8వ విడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు వస్తుండడంతో అధికారులు కార్యాచరణ రూపొందించి మొక్కలను సిద్ధం చేశారు. మొక్కలను నాటేందుకు వివిధ శాఖలకు టార్గెట్లు నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. రెండేండ్లుగా గ్రీన్ ఫండ్ పేరుతో నర్సరీలను ఏర్పాటు చేసి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొక్కల పెంపకం ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 526 గ్రామ పంచాయతీలతోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి మున్సిపాలిటీల్లో ఎనిమిదో విడుతలో 32.56 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులకు అప్పగించారు.
2015 జూలైలో హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఎనిమిదో విడుత కింద కామారెడ్డి జిల్లాలో 32,56,200 మొక్కలు నాటాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 526 గ్రామాలతోపాటు మున్సిపాలిటీల పరిధిలో మొక్కలను సిద్ధంగా ఉంచారు. హరితహారం కార్యక్రమాన్ని వచ్చేనెలలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలను హరితహారంలో భాగస్వామ్యం చేస్తున్నారు. వివిధ శాఖలకు నాటాల్సిన మొక్కల టార్గెట్ ఇచ్చారు. మిగితా మొక్కలను మరికొన్ని శాఖల ద్వారా నాటాలని నిర్ణయించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా 20.07లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. 2021-22లో జిల్లా వ్యాప్తంగా 47లక్షల 27వేల మొక్కలను నాటారు.
పల్లెలతోపాటు పట్టణాల్లో గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేసి పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. మున్సిపల్ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకొని మున్సిపాలిటీలో 10 శాతం హరితహారం గ్రీన్ఫండ్ నిధి కింద ఖర్చు చేయనున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల పరిధిలో ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, ఆర్థిక సంఘం నుంచి అభివృద్ధి కోసం నిధులు విడుదల అవుతాయి. వచ్చిన నిధులతో 10 శాతం గ్రీన్ ఫండ్ కింద వినియోగించి జనాభా ఆధారంగా మొక్కల పెంపకానికి, హరితహారానికి వినియోగించనున్నారు. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడంతోపాటు వర్షాలు బాగా కురుస్తున్నాయనే భావన వ్యక్తం అవుతోంది. మొక్కలు నాటడంపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలతోపాటు 526 గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఖాళీ స్థలాలను గుర్తించారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, రోడ్డుకిరువైపులా స్థలాలు, ఇతర ఖాళీ ప్రదేశాలను గుర్తించారు. వీటితోపాటు ఇంటింటా మొక్కలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టనున్నాయి. కలెక్టర్ జీతేశ్ వీ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు చంద్రమోహన్, దోత్రే, డీఆర్డీవో సాయన్న హరితహారం నిర్వహణపై దృష్టి పెట్టారు. ఆయా శాఖలను సమన్వయం చేస్తున్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం దక్కేలా చర్యలు చేపడుతున్నారు.
హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. జిల్లా పరిధిలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలు గుర్తించాం. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేశాం. ప్రతి ఇంటి ఆవరణతోపాటు ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలి.
జీతేశ్ వీ పాటిల్, కలెక్టర్