ఎడపల్లి/బోధన్ రూరల్/నవీపేట, జూన్ 25 : కలెక్టర్ ఆదేశాల మేరకు నిజాంసాగర్ కాలువ హద్దులను గుర్తించి, కబ్జాలకు గురికాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి, జాన్కంపేట్ గ్రామాల మధ్య రెవెన్యూ, మండల పరిషత్, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా శనివారం సర్వే నిర్వహించారు. ఆయా గ్రామాల మీదుగా నీటిని సరఫరా చేస్తున్న నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువ (డీ 46) హద్దులను నీటిపారుదల శాఖ డీఈఈ శ్రీనివాస్‌తో కలిసి ఎంపీడీవో సాజీద్ అలీ, రెవెన్యూ అధికారులు, ఎంపీపీ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ సావిత్రి, ఎంపీటీసీ రాంరెడ్డితో పాటు పలువురి సహాయంతో గుర్తించారు.
కాలువ హద్దులను ఏర్పాటు చేయడంతోపాటు కాలువ గట్టులో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకుగాను ఉపాధిహామీ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో గంగారాం, సిబ్బంది ఉన్నారు. బోధన్ మండలంలోని అమ్దాపూర్, ఊట్పల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్ డీ-40 కెనాల్ సరిహద్దులను బోధన్ తహసీల్దార్ శేకర్, ఎంపీడీవో మధుకర్, ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్‌తో కలిసి శనివారం గుర్తించారు. ఊట్పల్లి నుంచి అమ్దాపూర్, బెల్లాల్ గ్రామ పరిధి వరకు కాలువ రెండు వైపులా హద్దులను గుర్తించామన్నారు. హద్దు లోపల కబ్జా చేసిన వారు ఖాళీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఊట్పల్లి, అమ్దాపూర్ సర్పంచులు కృష్ణగుప్తా, మంజుల, అధికారులు, గ్రామస్తులు ఉన్నారు.
నవీపేట మండలంలోని శివ తండా వద్ద ఇరిగేషన్, రెవె న్యూ, పంచాయతీరాజ్ అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలువ హద్దులు గుర్తించే సర్వేను స్థానిక తహసీల్దార్ లత పరిశీలించారు. మండలంలోని నిజాంసాగర్ డి-50 కాల్వ హద్దుల సర్వేను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సర్వేలో కాలువకు ఇరువైపులా ఇరిగేషన్ స్థలం హద్దులను గుర్తించి ట్రెంచ్ కటింగ్ చేయించనున్నట్లు ఆమె తెలిపారు. గిర్దావర్ మోహన్, ఇరిగేషన్ సిబ్బంది ఉన్నారు.