ఎక్కడో విసిరి పడేసినట్టు ఉండే తండాలు.. కొండలు, గుట్టల అంచుల్లో నివాసముండే ఆదివాసీ కుటుంబాలు.. అడవి తల్లిని, అరకను నమ్ముకుని సాగుతున్న జీవితాలు.. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన బతుకులు వారివి.. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత వారి జీవితాల్లోకి కొత్త వెలుగులు వచ్చాయి. సీఎం కేసీఆర్ చొరవతో ఆదివాసీల పరిస్థితి మారిపోయింది. గ్రామపంచాయతీలుగా అవతరించిన తండాల్లో స్వయం పాలన మొదలైంది.
అభివృద్ధి వేగవంతమైంది. అయితే, ఇన్నాళ్లూ అద్దె భవనాల్లో కొనసాగిన ఆయా పంచాయతీలకు శాశ్వత భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేలా రూ.25 లక్షల వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. స్వయం పాలనతో పాటు శాశ్వత వేదికలు నిర్మించనుండడంతో గిరిజనుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
నిజామాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తండాలంటే ఊరికి చివరన, ఎక్కడో కొండల్లో, గుట్టల్లో పడేసినట్లు విస్తరించిన చిన్నపాటి ఆవాస కేంద్రాలు. ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన వ్యక్తుల సమూహంతో ఏర్పడిన శ్రమైక జీవనమే తండాల సొంతం. వ్యవసాయం, అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగించే తండాల్లో స్వతంత్ర భారతావనిలో ఏనాడు ఏ పాలకులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. అలాంటి తండాలు, గూడేలకు పంచాయతీ పరిపాలనను చేరువ చేయాలని దశాబ్ద కాలం క్రితమే తలచిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. గిరిజనుల ఎన్నో ఏండ్ల కలను సాకారం చేశా రు.
మా పాలన… మా తండా… అన్న నినాదంతో అధికార వికేంద్రీకరణ ఫలాలను తండాలకు చేర్చిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కింది. ఆదివాసీ గూడేలు, లంబాడా తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ 2018, మార్చి 28న చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం కొత్తగా తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మారి 2019లో పాలకవర్గాలు అధికారాలను చేపట్టాయి. ప్రస్తుతం గిరిజన గ్రామ పంచాయతీల్లో పంచాయతీ పాలన తాత్కాలిక ఏర్పాట్లలో కొనసాగుతుండగా త్వరలోనే ఉమ్మడి జిల్లాలో 134 గిరిజన జీపీలకు శాశ్వత భవనాలతో కార్యాలయాలను నిర్మించేందుకు సర్కారు సమాయత్తం అవుతున్నది
గిరిజన గ్రామాల్లో ఏర్పాటైన పంచాయతీలకు శాశ్వత భవనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వార్షిక బడ్జెట్లో ఈ అంశాన్ని సర్కారు ప్రస్తావించింది. ఇందుకు రూ.25లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారమే ఈ సంవత్సర కాలంలో జీపీ బిల్డింగ్ నిర్మాణాలను సర్కారు చేపట్టబోతున్నది. కొత్తగా నిర్మించబోయే గిరిజన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలపై పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు డిజైన్లను తీర్చిదిద్దారు. దీనికి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర సైతం వేయబోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జనాభాను అనుసరించి నమూనాలను వివిధ కేటగిరీల్లో రూపొందించనున్నట్లు తెలిసింది. లేదంటే ఒకే మాదిరిగా భవనాలన్నింటినీ నిర్మించాలని యోచిస్తున్నారు. భవనంతో పాటు నిర్మాణ ప్రదేశంలో ఖాళీ స్థలం పుష్కలంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆదర్శవంతమైన రీతిలో తీర్చిదిద్దేందుకు వీలుగా సువిశాలంగా స్థలాన్ని సేకరిస్తున్నారు. తద్వారా భవిష్యత్తులోనూ గ్రామ అవసరాలకు ఇతరత్రా నిర్మాణాలకు సైతం ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
ఎంపిక చేసిన గిరిజన గ్రామ పంచాయతీల్లో శాశ్వత భవనానికి సంబంధించి స్థలాల సేకరణ ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో పంచాయతీ అధికారులు రంగం లోకి దిగి అందుబాటులో ఉన్న స్థలాలను జీపీ కోసం కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ప్రభుత్వ స్థలం పుష్కలంగా ఉన్న జీపీలను ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేని చోట ప్రభుత్వ ఆదేశాల మేరకు దృష్టి సారించేలా జాబితాను ప్రత్యేకంగా చేస్తున్నారు.
నూతనంగా నిర్మించబోతున్న గిరిజన గ్రామ పంచాయతీ కార్యాలయాలకు 1000 గజాల స్థలాన్ని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేయి గజాలకు తగ్గకుండా స్థలం ఉండాలని సూచించింది. అనేక గిరిజన తండాలు పంచాయతీలుగా మారిన చోట స్థలాల కొరత లేదని తెలుస్తోంది. కాకపోతే కొన్ని చోట్ల ఒకే చోట నివాసాలకు దగ్గర్లో వేయి గజాలు దొరకడమే సమస్యగా మారింది. సమస్యను అధిగమించేందుకు క్షేత్ర స్థాయిలో జిల్లా పంచాయతీ అధికారులు, డివిజన్ స్థాయి పంచాయతీ అధికారులు పర్యటనలు చేసి ప్రభుత్వానికి త్వరలోనే నివేదికను సమర్పించబోతున్నారు.
గ్రామాలే దేశానికి వెన్నెముక అన్న మహాత్మా గాంధీ మాటలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. పల్లెలకు ప్రాణం పోసే విధంగా స్వపరిపాలన కాంతులను వెదజల్లుతున్నది. దశబ్దాలుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను 2018లో స్వతంత్ర హోదాతో పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో వాటి ఉనికి బాహ్య ప్రపంచానికి తెలియజేసినట్లు అయ్యింది. గతంలో గ్రామ పంచాయతీ ముఖం చూడాలంటే కిలో మీటర్ల మేర ప్రయాణించే పరిస్థితి నుంచి నేరుగా గ్రామ పంచాయతీలే నేడు ప్రజల చెంతకు చేరువవ్వడం కేసీఆర్ పరిపాలనకు సాక్షాత్కారంగా నిలిచింది.
ఇతర పంచాయతీల్లో విసిరేసినట్లుగా తండాలు కొన్నేండ్లుగా అభివృద్ధికి ఆమడదూరంగా ఉండేవి. ఏ సమస్య వచ్చినా ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించుకునేందుకు రోజులు తరబడి అవస్థలు పడేది. తండానే పంచాయతీ కావడంతో స్థానికుడే సర్పంచ్‌గా పరిపాలన బాధ్యతలు దక్కాయి. ప్రభుత్వం సైతం కార్యదర్శులను నియమించి శ్రద్ధ వహించడంతో పల్లె ప్రగతి ప్రతి తండాల్లో వికసిస్తోంది. ఇక శాశ్వత జీపీ భవనాలు ఏర్పాటైతే ప్రధాన సమస్య సైతం కనిపించకుండా పోనుంది.
మా హయాంలో గ్రామ పంచాయితీ భవనానికి నిధులు మంజూరు చేసిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. గతంలో పాలించిన ప్రభుత్వాలు గిరిజన తండాలను ఎనాడూ పట్టించుకోలేదు. తండాలను పంచాయతీలుగా మార్చి మా సమస్యలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-జాదవ్ సునీత,మౌలాలీ తండా సర్పంచ్ , రెంజల్
తండాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీ భవనం కోసం రూ.25 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించడం హర్షనీయం. గత పాలకులు ఎవరూ తండాలను గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం కేసీఆర్ ప్రభు త్వంలోనే గిరిజనులకు అధిక ప్రాధాన్యాత కల్పించారు. ప్రజలందరికీ పరిపాలన చేరువయ్యింది.
-గణేశ్‌నాయక్, వీరన్నగుట్ట తండా సర్పంచ్, రెంజల్
సీఎం కేసీఆర్ సార్ అచ్చినంక తండాలను పంచాయతీలుగా చేసిండు. గప్పట్ల మా తండాలను పట్టించుకునేటోళ్లు లేకుండె. కేసీఆర్ సార్ అచ్చినంక తండాలల్ల మంచిగా పనులు అయితున్నయి. గిప్పుడు పంచాయతీ బిల్డింగ్‌కు పైసలు ఇస్తరని చెబుతుండ్రు. మమ్ములను గిట్ల పట్టించుకునెటోళ్లను గిప్పటిదాకా సూడలె. కేసీఆర్ సారు సల్లంగుండాలె..
-కాట్రోత్ మేనిబాయి, సర్పంచ్, దుబ్బతండా, మోస్రా