నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 28: తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనేదాక ఉద్యమిస్తామని రైతన్నలు స్పష్టం చేశారు. కొనుగోళ్లపై సాకులు చెబుతూ మోదీ ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలు, మార్కెట్ కమిటీ పాలక వర్గాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు అధ్యక్షుల ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. పంజాబ్లో కొనుగోలు చేస్తున్నట్లు భారత ఆహార సంస్థ ద్వారా రెండు కాలాల్లో పండిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం తీర్మాన కాపీలను ప్రధాని మోదీకి పోస్టు చేశారు. ఈ సందర్భంగా విండో, ఏఎంసీ చైర్మన్లు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల పట్ల వివక్షత చూపుతుందని మండిపడ్డారు.