డిచ్పల్లి, సెప్టెంబర్ 8 : వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో ఆర్టీసీ బస్సు బోల్తా పండింది. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని నాగ్‌పూర్ గేట్ వద్ద గురువారం ఉదయం చోటుచేసుకోగా, ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ డిపోకు చెందిన సూపర్‌లగ్జరీ బస్సు ఒంగోలు నుంచి బోధన్‌కు వెళ్తున్నది.
16 మంది ప్రయాణికులతో గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు డిచ్పల్లి వద్దకు రాగానే మూలమలుపు వద్ద వెనుక నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ అప్సర్‌తోపాటు ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలిసిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రయాణికులను బస్సు నుంచి బయటికి తీశారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డిప్యూటీ ఆర్ఎం శంకర్, నిజామాబాద్ డిపో-2 డీఎం వెంకటేశ్వర్లు, డీఐలు రవీందర్, వీసీఎస్ రెడ్డి, సీఐ లక్ష్మణ్ (బోధన్ డిపో), కంట్రోలర్లు చందర్‌నాయక్, దాసు క్రేన్ సహాయంతో బస్సును పైకి లేపారు.
బస్సు బోల్తా పడిన సమయంలో పరేడ్‌కు వెళ్తున్న 7వ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుళ్లు గమనించి వెంటనే స్పందించారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి క్షతగాత్రులను బయటికి తీశారు. హైవే హెల్ప్‌లైన్ 1033 నంబర్‌కు సమాచారం అందించి దవాఖానకు తరలించారు. మానవత్వం చాటుకున్న బెటాలియన్ కానిస్టేబుళ్లు ఐ.రాకేశ్, ఎం.అనిల్‌కుమార్, వి.భూమేశ్వర్‌ను కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాసరావు, స్థానికులు అభినందించారు.