ఇందూరు, ఆగస్టు 27 : టీఎస్ బీ-పాస్ యాక్ట్‌ను పక్కాగా అమలుచేయాలని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిని ఉపేక్షించవద్దని కలెక్టర్ నారాయణరెడ్డి మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో ఆయా శాఖల అధికారులతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి టీఎస్ బీ-పాస్ యాక్ట్, పట్టణ ప్రగతి, హరితహారం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదివరకు మున్సిపల్ పరిధిలో చేపట్టే నిర్మాణాలకు కౌన్సిల్ అనుమతి, తీర్మానాలు చేసేవారని, ప్రస్తుతం వీటి అవసరం లేకుండా టీఎస్ బీ-పాస్ ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తూ చేపట్టే నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
అక్రమ నిర్మాణాలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ప్రతి మున్సిపాలిటీలో వచ్చే సోమవారం నాటికి కైంప్లెంట్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ బృందం నిర్మాణాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
15 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు. టీఎస్ బీ-పాస్ యాక్ట్ అమలులోకి రాక ముందు పూర్తయిన నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు తదితర చర్యలకు ఉపక్రమించవద్దని స్పష్టంచేశారు. సమీకృత మార్కెట్ యార్డుల నిర్మాణాలను వేగవంతం చేయించాలని, వైకుంఠధామాల్లో విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటించాలని అన్నారు.
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, కరెంట్ సరఫరాలో లోటుపాట్లు తావు లేకుండా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటితే సంబంధిత అధికారుల నుంచి నిధులను రికవరీ చేయిస్తామని హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.