కంఠేశ్వర్, నవంబర్ 19: ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీసీలో పాల్గొన్న సమాఖ్య ప్రతినిధులకు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ‘మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి’ పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీకి చర్యలు తీసుకున్నామని తెలిపారు. విమర్శలు, పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి మహిళకూ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేలా సమాఖ్య ప్రతినిధులు కృషి చేయాలన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఒకరి చొప్పున స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం ప్రతి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళలవివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. కల్తీ కల్లు, మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేకించి గర్భిణులు వీటికి దూరంగా ఉండేలా మహిళా సమాఖ్య ప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమిషనర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.