కంఠేశ్వర్, ఏప్రిల్ 6:ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16న జరిగే మండల స్థాయి సభలు విజయవంతమయ్యేలా కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఈ నెల 2న నిర్వహించిన గ్రామసభలు విజయవంతమయ్యాయని, అదే స్ఫూర్తితో మండల స్థాయి సభలను కూడా సమర్థవంతంగా జరిగేలా చూడాలన్నారు. సోమవారం సంబంధిత శాఖలతో సమావేశమైన కలెక్టర్.. మండల సభ నిర్వహణ సమయానికి ముందే ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులు, రేషన్ కార్డులు, పింఛన్లు వంటి వాటికి సంబంధించి గ్రామసభలలో అందిన దరఖాస్తులను తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు.
కాగా జనాభా గణనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని పట్టణాలు, మండలాల్లో ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజువారీగా ఈ ప్రక్రియ అమలును పర్యవేక్షించాలని సబ్కలెక్టర్లు, ఆర్డీవోలను ఆదేశించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియకు విద్యాశాఖ పూర్తి సహకారమందించేలా చూడాలన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా నిధులు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.