కంఠేశ్వర్, మార్చి 31: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి వాటి నిరోధానికి అవలంబించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు. గడిచిన రెండు మాసాల్లో జిల్లాలో ఎక్సైజ్, పోలీసు శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ఫ్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసులపై అధికారులు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్‌కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఈవో అశోక్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల, డీటీవో ఉమామహేశ్వర్రావు, జిల్లా ఔషధ నియంత్రణ అధికారి శ్రీలత, డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీడబ్ల్యూవో పద్మ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన..
రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించగా సీపీ సాయిచైతన్య హాజరయ్యారు. నేషనల్ హైవే అథారిటీ, ఆర్అండ్బీ, రవాణాశాఖ, ఆర్టీసీ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్యారోగ్యం, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో పాటు రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్‌కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఈవో అశోక్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల, డీటీవో ఉమామహేశ్వర్రావు, జిల్లా వ్యవసాయాధికారి వీరస్వామి, హర్ష పాల్గొన్నారు.