నిజామాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ప్రకటించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గంప గోవర్ధన్ మినహా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారందరికీ అవకాశం దక్కింది. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవలో తరిస్తున్న నేతలందరికీ మరోసారి ప్రజలంతా పట్టం కట్టాలని కేసీఆర్ కోరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ ఎత్తున ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తంచేయగా అలాంటి ఫలితాలే ఉమ్మడి జిల్లాలో ప్రస్ఫుటం అవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిదేండ్లలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు అభివృద్ధి చెందాయి. అన్ని నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల కల్పన భారీ ఎత్తున జరిగింది. కేసీఆర్ దార్శనికతతో ఎమ్మెల్యేలంతా శ్రమించి తమ ప్రాంతాలను అభివృద్ధి పరిచారు. ఇప్పుడిదే ప్రగతి ఎజెండాతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే వారంతా ప్రజల ముందుకు రాబోతున్నారు.
మరోసారి విజయం దిశగా..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆది నుంచి గులాబీ పార్టీకి కంచుకోట. 2001లో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలంతా కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. స్వరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ బ్రహ్మరథం పట్టారు. 2014లో 9 స్థానాలకు 9 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2018లో 9 స్థానాలకు 8 చోట్ల విజయం సాధించినప్పటికీ తదనంతర కాలంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కారు గూటికే చేరారు. మరోసారి కంచుకోటను పదిలపర్చుకోవడమే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల నుంచి 2014లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన జీవన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గణేశ్ గుప్తా, షకీల్ అహ్మద్‌లు మూడోసారి ముచ్చటగా బరిలో నిలుస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ ద్వారా మూడోసారి పోటీలో ఉంటున్నారు. గతంలో ఆర్మూర్, బాన్సువాడ నుంచి ఇతర పార్టీల్లో విజయం సాధించిన బాజిరెడ్డి మరోసారి విజయం దిశగా అడుగులువేస్తున్నారు.
కామారెడ్డిలో ఆ ముగ్గురు…
కామారెడ్డి జిల్లాలో తిరిగి ఆ ముగ్గురికే టికెట్లు వరించాయి. బాన్సువాడ బాద్షాగా గుర్తింపు పొందిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మరోసారి ఎన్నికల బరిలో నిలువబోతున్నారు. బాన్సువాడలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన స్పీకర్‌తోపాటు జుక్కల్ నియోజకవర్గం నుంచి హన్మంత్ షిండే, ఎల్లారెడ్డి నుంచి జాజాల సురేందర్ బరిలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీపై విధేయత, ప్రజా సేవ, నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి పేరును సంపాదించుకోవడం వంటి కారణాలతో వీరికే పార్టీ అగ్రనాయకత్వం టికెట్లను కేటాయించింది. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన జాజాల సురేందర్ తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయబోతుండడం విశేషం. వరుసగా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ ముఖ్య నేతల సభలు, సమావేశాలతో ఇప్పటికే క్యాడర్లో జోష్ కొనసాగుతున్నది.
దమ్మున్న సీఎం… ధైర్యంగల్ల ప్రకటన…
తెలంగాణకు ఇది ఉత్సాహకరమైన సమయం. రా నున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ 119 స్థానాలకు 115స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. సీఎం కేసీఆర్ ధైర్యవంతమైన నాయకత్వం, ప్రభావశీలమైన బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారన్న నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాన్ని వినమ్రంగా కోరుతున్నాను.
నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్..
బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. సామాన్య కుటుంబం నుంచి రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రజానాయకుడిగా పేరొందిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. సిరికొండ మండలంలోని చీమన్‌పల్లి గ్రామానికి చెందిన శాంతాబాయి, దిగంబర్ పటేల్ దంపతులకు 17 ఫిబ్రవరి 1954లో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న ఆయనకు భార్య వినోద, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1981లో చీమన్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. భీమ్‌గల్ యూత్ కాంగ్రెస్ ఏజెంట్‌గా పనిచేసి 1987లో సిరికొండ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1992లో సిరికొండ సింగిల్‌విండో చైర్మన్‌గా, 1993లో ఏపీఎస్ఎఫ్సీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 1994లో ఆర్మూర్ ఆసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్మూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడా ఘనవిజయం సాధించారు. 2009లో ఓటమి పాలయ్యారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2021లో సెప్టెంబర్ 16న ఆర్టీసీ చైర్మన్‌గా ఎంపికై బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోసారి టికెట్ కేటాయించడంపై హర్షం వ్యక్తంచేస్తూ సీఎం కేసీఆర్‌కు బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు.
జుక్కల్ బరిలో హన్మంత్‌షిండే
జుక్కల్ మండలంలోని డోన్గావ్ గ్రామానికి చెందిన నాగమ్మ-మాదప్ప దంపతులకు 1966 ఆగస్టు 14న హన్మంత్‌షిండే జన్మించారు. 1988లో ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం నిర్వర్తిస్తూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. హన్మంత్ షిండేకు భార్య శోభావతి, ముగ్గురు కుమారులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హన్మంత్ షిండే.. 2004లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జుక్కల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాం చేతిలో 1241 ఓట్ల తేడాతో ఓడి పోయాడు. 2009లో జుక్కల్ నుంచి టీడీపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రిబాయిపై ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 2013లో డిసెంబర్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాంపై రెండోసారి విజయం సాధించారు. 2016 మే 26 నుంచి 2018 సెప్టెంబర్ 6వ తేదీ వరకు తెలంగాణ శాసనసభ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మూడోసారి బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాంపై విజయం సాధించారు. 2021 అక్టోబర్ 5న శాసనసభ ప్యానల్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మరోసారి టికెట్ కేటాయించడంపై సీఎం కేసీఆర్‌కు షిండే కృతజ్ఞతలు తెలిపారు.
– హన్మంత్ షిండే, ఎమ్మెల్యే, జుక్కల్
నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా బిగాల గణేశ్ గుప్తా..
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా బిగాల గణేశ్ గుప్తా పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన బిగాల కృష్ణమూర్తి-సువర్ణమాల దంపతులకు 17 ఏప్రిల్ 1970లో బిగాల గణేశ్ గుప్తా జన్మించారు. బీదర్‌లోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. భార్య లత, కుమార్తెలు రిది, రియా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారానే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2014లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మీర్ మజాజ్ అలీపై 10,308 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో మరోసారి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బిగాల.. కాంగ్రెస్ అభ్యర్థి తాహెర్‌బిన్ హందాన్‌పై 25వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
నా జీవితం సార్థకం…
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ దళపతి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ, రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం నిర్మించిన సందర్భంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా రెండుసార్లు కొనసాగడం నా జీవితానికి సార్థకతను చేకూర్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కొనసాగాలని ఎంతో మంది ఆరాటపడ్డారు. నాకు అవకాశం దక్కింది. మరోమారు తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కూడా నా వెన్నంటే ఉన్నవి.
– బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి అభ్యర్థిగా జాజాల సురేందర్
బీఆర్ఎస్ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా జాజాల సురేందర్ పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. లింగంపేట మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన జాజాల హన్మవ్వ, జాజాల నర్సయ్య దంపతులకు 25 మార్చి 1973లో జన్మించారు. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివిన సురేందర్‌కు భార్య జాజాల భార్గవి, ఇద్దరు కుమారులు జాజాల కిన్షుక్, జాజాల కీర్తీశ్ ఉన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2004లో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందగా, 2018లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి 35వేల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం భారత రాష్ట్ర సమితిలో చేరారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై జాజాల సురేందర్ హర్షం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ తరఫున టికెట్ కేటాయించ డంపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
నాపై నమ్మకంతో బోధన్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ తరఫున టికెట్ కేటాయించిన అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు. బోధన్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించారు. మూడోసారి కూడా తప్పకుండా విజయం సాధిస్తా.
– మహ్మద్ షకీల్ ఆమేర్, ఎమ్మెల్యే, బోధన్
బోధన్ నుంచి మూడోసారి షకీల్..
బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ పేరును ఖరారు చేశారు. ఇప్పటి వరకు రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లికి చెందిన మహ్మద్ ఆజాం, షాగుఫ్తా ఆదిప్ దంపతులకు 7 మార్చి 1976న మహ్మద్ షకీల్ జన్మించారు. డిగ్రీ విద్యాభ్యాసం చేసిన షకీల్.. 1996లో ఆయేషా ఫాతిమాను వివాహమాడారు. వీరికి కుమారుడు మహ్మద్ రాహిల్ ఆమేర్, కుమార్తెలు ఐమన్ ఫాతిమా, సుమయా ఫాతిమా, సుఫియా ఫాతిమా ఉన్నారు. 20 ఏండ్ల వయస్సులో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2007లో జరిగిన స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో పోటీచేసి ఆరు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో బీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పి.సుదర్శన్‌రెడ్డిపై కేవలం 1275 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ షకీల్ నిరుత్సాహపడకుండా రాజకీయాల్లో కొనసాగారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న అప్పటి రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిపై విజయం సాధించారు. 2018లో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి తన సమీప ప్రత్యర్థి పి.సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు.
ఆర్మూర్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి..
ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. సామాన్య రైతు కుటుంబం నుంచి తెలంగాణ ఉద్యమకారుడి వరకూ, స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రజాప్రతినిధిగా జీవన్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన వెంకటరాజన్న రాజాబాయి దంపతులకు 1976 మార్చి 7న జన్మించారు. తండ్రి వెంకటరాజన్న జాన్కంపేట్ ఉపసర్పంచ్‌గా పనిచేయగా, మామ యాల్ల రాములు ఆర్మూర్ ఎంపీపీగా పనిచేశారు. జీవన్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులై జిల్లా బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. జీవన్‌రెడ్డికి రజితారెడ్డితో వివాహం జరగగా కుమార్తెలు అనౌషికారెడ్డి, అనన్యారెడ్డి ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో జీవన్‌రెడ్డి కీలకపాత్ర వహించారు. బకాయిల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతున్న ఎర్రజొన్న రైతులకు బాసటగా నిలిచిన జీవన్‌రెడ్డి నిరాహార దీక్ష చేశారు. బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా, ఆర్మూర్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ తరఫున ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పార్టీ తొలి టికెట్ పొందిన నేతగా గుర్తింపు పొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌రెడ్డిపై గెలుపొందారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితపై 28,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల కమిటీ (పీయూసీ) చైర్మన్‌గా 2019 అక్టోబర్ 31న బాధ్యతలు స్వీకరించారు. 26 జనవరి 2022 నుంచి బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జీవన్‌రెడ్డి కొనసాగుతున్నారు.
బాన్సువాడ నుంచి లక్ష్మీపుత్రుడు..
బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా లక్ష్మీపుత్రుడు పోచారం శ్రీనివాసరెడ్డికి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గల పోచారం శ్రీనివాసరెడ్డి.. సీఎం కేసీఆర్‌కు నమ్మిన బంటుగా ఉంటున్నారు. బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి చెందిన పరిగె పాపమ్మ-రాజారెడ్డిల కుమారుడే పోచారం శ్రీనివాసరెడ్డి. 10 ఫిబ్రవరి 1949లో జన్మించిన ఆయన బీఈ చదివారు. పరిగె పుష్పమ్మతో వివాహం జరుగగా, డాక్టర్ పరిగె రవీందర్‌రెడ్డి, పరిగె సురేందర్‌రెడ్డి, పరిగె భాస్కర్‌రెడ్డి, పరిగె అరుణ సంతానం. 1976లో పరిగె శ్రీనివాస రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1977లో సొసైటీ డైరెక్టర్‌గా పోటీచేశారు. 1978లో బాన్సువాడ సమితికి పోటీచేసి ప్రత్యర్థి ఆర్ వెంకట్రామ్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1987లో బుడ్మి సొసైటీ (తాడ్కోల్) అధ్యక్షుడిగా ఎన్నికై, ఎన్డీసీసీబీ చైర్మన్ అయ్యారు.1988లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీచేసి ప్రత్యర్థి బాలాగౌడ్ చేతిలో ఓటమిపాలయ్యారు. 1994లో బాన్సువాడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2000సంవత్సరంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2002లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2011 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీలో చేరి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియామకం అయ్యారు. 2011లో జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి వ్యవసాయ, సహకార, మత్స్య , పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటికి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన పోచారం.. 2019 జనవరి నుంచి శాసనసభ స్పీకర్‌గా సేవలు అందిస్తున్నారు. 40ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిను సీఎం కేసీఆర్ లక్ష్మీపుత్రుడిగా పిలువడం విశేషం.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా పేరును ప్రకటించినందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తూ.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాం. నియోజకవర్గ ప్రజల అండదండలతో మరోసారి విజయం సాధిస్తాను.
– పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్
బాల్కొండ బరిలో మరోసారి ఖద్దరు ఇంజినీర్..
బాల్కొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున మూడోసారి పోటీ చేసేందుకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రెండు పర్యాయలు గెలిచి నియోజకవర్గానికి వేముల ప్రశాంత్ రెడ్డి అందించిన ఘనమైన అభివృద్ధిని, రాజకీయంగా మంత్రి పయనాన్ని ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. 2001లో జలదృశ్యంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిన నాటి నుంచి వెంట నడిచిన, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన దివంగత రైతునేత వేముల సురేందర్‌రెడ్డి-మంజుల దంపతుల మొదటి కుమారుడు వేముల ప్రశాంత్ రెడ్డి. వేల్పూర్ గ్రామంలో 14 మార్చి 1966న జన్మించారు. సివిల్ విభాగంలో బీఈ పూర్తిచేసిన ప్రశాంత్‌రెడ్డి.. నీరజారెడ్డిని వివాహమాడారు. వీరికి కొడుకు పూజిత్‌రెడ్డి, కూతురు మానవిరెడ్డి ఉన్నారు. తండ్రి వేముల సురేందర్ రెడికి చేదోడు వాదోడుగా ఆయన అడుగు జాడల్లో పరోక్ష రాజకీయాల్లో ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి … తండ్రి తర్వాత కేసీఆర్ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్‌లో బిల్డర్‌గా ఎదుగుతూనే 2014ఎన్నికల్లో కేసీఆర్‌తో అందరికన్నా ముందుగానే టికెట్ ఖరారు చేయించుకొని 36, 248 ఓట్ల మెజారిటీ సాధించి జిల్లాలో అత్యధికంగా మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా నిలిచారు. రెండోసారి 2018లోనూ 32, 408 ఓట్లతో జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించారు. 2016 నుంచి 2018 వరకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు.
కేసీఆర్ నమ్మకాన్నినిలబెడతాం..
తన తండ్రి, రైతు నాయకుడు వేముల సురేందర్ రెడ్డికి ఒకసారి..తనకు మూడుసార్లు వరుసగా పార్టీ టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్‌కు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ ఈసారి కూడా ప్రజా క్షేత్రంలో విజయం సాధిస్తాం. ఉమ్మడి జిల్లా నాయకులు విజ్ఞప్తి మేరకు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేయనుండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రి
కేసీఆర్‌కు పాదాభివందనం..
తనపై ఎంతో నమ్మకంతో ఆర్మూర్ నుంచి మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి పాదాభివందనం చేశారు. కేసీఆర్ నమ్మకాన్ని నిజం చేస్తూ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు. తనకు టికెట్ ఇచ్చిన కేసీఆర్‌కు, నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.