ఖలీల్‌వాడి, నవంబర్ 28 : ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని ప్రచారం చేశారు. నెల రోజులకు పైగా నిజామాబాద్‌లోనే బస చేసిన కవిత ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని 10 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. నిజామాబాద్ అర్బన్, బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాలకు హాజరై ప్రసంగించారు. 70కి పైగా రోడ్‌షోలు, పాదయాత్రలు, స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, బహిరంగ సభలు, ఆయా సంఘాలు నిర్వహించిన సమావేశాల్లో పాల్గొని హోరెత్తించారు. కులసంఘాల సమ్మేళనాలు, యువ, మహిళ, కార్మికుల సమ్మేళనాల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు గాను కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలో ప్రజలకు అర్థమయ్యే తీరులో చక్కగా వివరించారు. సీఎం కేసీఆర్ సంకల్పించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కాకుండా రాజకీయ పరిస్థితులపై ప్రజలకు చైతన్యం కలిగించేలా సభలు సమావేశాల్లో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టారు. తమ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలు, ఆరోపణలు దీటుగా సమాధానం ఇచ్చారు. పదునైన మాటలతో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాష్ర్టాన్ని 55 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది శూన్యమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఉదాహరణలతో సహా కాంగ్రెస్ పాలనను పదేండ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చి చెప్పడం ప్రజలను ఆకర్షించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్, నిత్యావసర వస్తువుల ధ రలను పెంచ డం వంటి అంశాల పై ప్రజాక్షేత్రంలో నిలదీశారు. ఆ రెండు పార్టీల పైఫల్యాలను ఎండగడుతూనే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను, పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో కలిగిన ప్రయోజనాలు అభివృద్ధిపై తనదైన శైలిలో ఆసక్తికరం గా వివరించడం విశేషం. కవిత ప్రసంగాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయి. పెన్షన్ల నుంచి ఉద్యోగ నియామకాలు, అభివృద్ధి ఇలా అన్ని అంశాలపై సమగ్ర అవగాహనతో ప్రసంగాలు చేశారు.
ఎమ్మెల్సీ పాల్గొన్న ప్రతి సభలు, రోడ్‌షోలు, సమావేశాలకు మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలిరావడం గమనార్హం. మహిళలు, యువత కవిత పట్ల ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. అనేకసార్లు కవిత రోడ్‌షోలు, సభలు ముగిసిన వెంటనే వేదిక దిగి నేరుగా మహిళల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వారు కూడా కవితను ఆప్యాయం గా పలకరించారు. అదే విధంగా యువత కూడా కవిత ప్రచార కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఏ గ్రామానికి వెళ్లినా కవితకు ఘనస్వాగతం లభించింది.
ప్రచార కార్యక్రమాల సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన కవిత కోరుట్ల టౌన్ బీజేపీ అధ్యక్షుడు, ఇద్దరు కౌన్సిలర్లతో పాటు దా దాపు 200 మంది కార్యకర్తలను పార్టీలో చేర్చుకు ని దాదాపు ఆ నియోజకవర్గంలో బీజేపీ ఖాళీ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలోనూ పెద్దసంఖ్యలో యువత కవిత సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.