నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 9: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ఉపాధ్యాయులూ కలిసి నడిచివచ్చారని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాసన సభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రిలా పరిష్కరిస్తున్నారని అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాలులో పీఆర్టీయూ టీఎస్ 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. పీఆర్టీయూతో తన అనుబంధం ఇప్పటిదికాదని, తన తండ్రి ఉన్నప్పటి నుంచి ఉందన్నారు. రాష్ట్రంలో లక్షా రెండువేల మంది ఉపాధ్యాయులు ఉండగా, ఇందులో 75 వేల మంది పీఆర్టీయూ టీఎస్ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. టీచర్ల ప్రయోజనాలు, వారి హక్కులను కాపాడుకోవడానికి యూనియన్ కృషి చేస్తోందన్నారు. అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఒకరికొకరు కలిసి పనిచేసే వ్యక్తులు ఇందులో ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో చాలామందితో కలిసి పనిచేసినా, అందరం కలిసి పనిచేసినా ఎవరిస్థాయిలో వారు కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తులమని అన్నారు. ఆ ఉద్యమమే ఇప్పుడు ఒకశక్తిగా తయారుచేసిందన్నారు.
ఉపాధ్యాయులంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో గౌరవం
: అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ.. పిల్లలు మంచిగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలన్నా, ప్రయోజకుడు కావాలన్నా వందకు వంద శాతం టీచర్లు నేర్పించిన చదువే కారణమన్నారు. ఉపాధ్యాయులంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో గౌరవం అన్నారు. టీచర్లు వారి సమస్యలను యూనియన్ నాయకుల ద్వారా సీఎం దృష్టికి తెచ్చిన ప్రతిసారి ప్రతినిధులతో చర్చించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సంఘం ఏదైనా ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. అనంతరం పీఆర్టీయూ టీఎస్ కామారెడ్డి శాఖ జనరల్ ఫండ్ కింద రూ.55,55,555 చెక్కును మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర శాఖకు అందజేసింది. సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నగర మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి కమలాకర్, జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్‌గౌడ్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. నేడు యూనియన్ రాష్ట్ర నూతన కమిటి ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.