Union Budget | కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి వచ్చే ప్రకటనలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రధానంగా పసుపుబోర్డుకు నిధుల కేటాయింపు, రైల్వే లైన్ల అభివృద్ధికి సీతమ్మ ఏ మేరకు కరుణ చూపుతారన్నది ఆసక్తిగా మారింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలో రైల్వే లైన్ల అభివృద్ధి అంతంత మాత్రంగానే జరుగుతున్నది. పూర్తి స్థాయిలో రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ చేసినప్పటికీ, డబ్లింగ్ పై నిర్మలమ్మ ప్రతి బడ్జెట్లోనూ నిరాశే కలిగిస్తున్నది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా డబ్లింగ్ ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నా, ఉమ్మడి జిల్లాపై మాత్రం కేంద్రం వివక్ష చూపుతున్నది. ఇక, పదేండ్లు పట్టించుకోని పసుపుబోర్డును మొన్న సంక్రాంతి రోజున హడావుడిగా ప్రారంభించిన కేంద్రం.. పైసా ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు, పసుపుబోర్డు కార్యరూపం దాల్చితే పసుపు ఎగుమతుల కోసం రైల్వే లైన్ల అభివృద్ధి ఎంతో కీలకం కానున్నది. ఈ తరుణంలో బీజేపీ నేతలు డబ్లింగ్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు. ధర్మపురి అర్వింద్ రెండుసార్లు ఎంపీగా ఉన్నప్పటికీ నిజామాబాద్ ప్రాంతానికి ప్రత్యేకంగా చేసిన మేలు మాత్రం శూన్యమే. కనీసం రైల్వే డబ్లింగ్, పసుపుబోర్డుకు నిధులు తేవడం, బోర్డు కార్యకలాపాలు ప్రారంభించి రైతులకు మేలు చేసేలా చూడాల్సిన బాధ్యత ఎంపీపై ఉన్నది.
నిజామాబాద్ ప్రాంతం హైదరాబాద్‌కు దాదాపుగా 160 కిలో మీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే బస్సులో, సొంత వాహనాల్లో చేరడం వ్యయ, ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. రైలు ప్రయాణమైతే తక్కువ ఖర్చులోనే చేరుకునే వెసులుబాటు ఉంది. రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా రైల్వేలు విస్తరిస్తున్నప్పటికీ ఈ ప్రాంతంపై అటు కేంద్రం, ఇటు రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నది. డబ్లింగ్ చర్యలకు నాంది పలకడం లేదు. నిజామాబాద్ మీదుగా ముంబై, హైదరాబాద్ మార్గాలను వాణిజ్య అవసరాలకే దక్షిణ మధ్య రైల్వే వాడుకుంటున్నది. ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్లుగా రైళ్లను తిప్పడం లేదు. సింగిల్ లైన్ ఉండడం ప్రతిబంధంకంగా మారింది.
డబ్లింగ్ వేయడం ద్వారా గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు ఎలాంటి అవరోధాలూ ఉండవు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల నుంచి బీజేపీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ప్రజల ఆశలు నెరవేరడం లేదు. డబ్లింగ్పై నిజామాబాద్ ఎంపీకి పలు సంఘాలు, ప్రజలు ఎన్నోసార్లు విన్నవించారు. కానీ అర్వింద్ ఏనాడూ పట్టించుకోలేదు. రైల్వే అభివృద్ధి అన్నది కాలానికి తగ్గట్లుగా ఎలక్ట్రిఫికేషన్, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ జరిగి పోతున్నది తప్పితే లోక్‌సభ సభ్యుల చొరవ మాత్రం ఉండడం లేదు. పసుపుబోర్డును తామే తెచ్చామని బీజేపీ చెబుతున్న నేపథ్యంలో డబ్లింగ్ సమస్య కూడా తీర్చి తమకు మేలు చేయాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.
కేంద్ర సర్కారు తీరుపై పసుపు రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2019 ఎన్నికల్లో పసుపుబోర్డు ఏర్పాటుపై హామీలిచ్చి ఐదున్నరేండ్ల పాటు కాలక్షేపం చేశారు. పూటకో మాట మాట్లాడి పసుపు రైతులను గందరగోళంలో పడేశారు. 2023లో ప్రధాని మోదీ స్వయంగా పసుపుబోర్డు ఏర్పాటుపై ప్రకటన చేయగా, మొన్న జనవరి 14న నిజామాబాద్‌లో పసుపుబోర్డును ఏర్పాటు చేసినట్లు బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రకటించారు. ఎక్కడా అంగుళం భూమి సేకరించలేదు. కార్యాలయం కూడా లేనే లేదు. అయినప్పటికీ ప్రైవేటు హోటల్లో పసుపుబోర్డు ప్రారంభోత్సవాన్ని నిర్వహించి చేతులు దులుపుకున్నారు.
నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు కావాలంటే, రైతుల ఆకాంక్షలకు తుది రూపం దక్కాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలి. ఈ నేపథ్యంలోనే నేడు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో పసుపుబోర్డుకు నిధులిస్తారా.. లేదా? అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. బోర్డు కార్యకలాపాలు జరగాలంటే కేంద్ర సర్కారు సహకారం తప్పనిసరి. అలాంటప్పుడు కేంద్ర బడ్జెట్లో ఈ అంశం ప్రస్తావనకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పసుపుబోర్డు విధివిధానాలపై ఇప్పటి వరకు కేంద్రం స్పష్టమైన ప్రకటనే చేయలేదు. కానీ బోర్డు చైర్మన్‌ను మాత్రం నియమించి మమ అనిపించింది.