నిజామాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిషేధిత అల్ఫ్రాజోలం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య స్పష్టం చేశారు. అక్రమ వ్యవహారాల్లో తలదూర్చే వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. అల్ఫ్రాజోలం వంటి నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారి ఆస్తులు జప్తు చేసే అధికారం పోలీసులకు ఉన్నదని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారెవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. సోమవారం నిజామాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాయిచైతన్య మీడియాతో మాట్లాడారు.
శాంతిభద్రతల పరిరక్షణ మొదటి ప్రాధాన్యమని వెల్లడించారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సీపీగా రాక మునుపు నార్కొటిక్స్ విభాగంలో పని చేసిన అనుభవాన్ని జోడించి నిజామాబాద్‌లో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం పాటుపడతానన్నారు. గతంలో నిజామాబాద్‌లో తానే స్వయంగా దాడులు నిర్వహించి అల్ఫ్రాజోలం పట్టుకున్నట్లు తెలిపారు. భూ కబ్జాలు, రౌడీ షీటర్ల ఆగడాలను అరికట్టేందుకు హైదరాబాద్ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పారదర్శకంగా, అత్యంత కచ్చితత్వంతో పోలీసుల సేవలు అందుతాయన్నారు. డ్రగ్ ఫ్రీ నిజామాబాద్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
సహజ వనరుల దోపిడీని నివారించేందుకు కఠినంగా వ్యవహరిస్తామని, ఇసుకను అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. సైబర్ నేరాల నుంచి ప్రజలను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు.