బోధన్/ నందిపేట్, నవంబర్ 26 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏడు కొత్త మండల ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో జిల్లాల పునర్విభజన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త పంచాయతీలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే, మండలాలు ఏర్పడి, పాలన వికేంద్రీకరణ జరిగినప్పటికీ మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటు కాలేదు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా ప్రభుత్వం మండల ప్రజా పరిషత్‌ల ఏర్పాటుకు ముందడుగు వేసింది. 2019లో మండల పరిషత్ ఎన్నికలు పూర్తయిన తర్వాత సాలూర, పొతంగల్ మండలాలు ఏర్పాటుచేయాలని ఆయా మండలాల ప్రజలు కోరడంతో స్పందించిన నాటి సీఎం కేసీఆర్ కొత్త మండలాలను ఏర్పాటుచేశారు. ఆయా మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాలను ఏర్పాటుచేయడంతో ప్రజలకు పాలన చేరువైంది. సాంకేతిక కారణాలతో అప్పట్లో మండల పరిషత్‌లను ఏర్పాటుచేయలేదు. మేలో మండల పరిషత్ పాలకవర్గాల కాల పరిమితి ముగిసింది.
నిజామాబాద్ జిల్లాలో ఆలూర్ (10 గ్రామాలు), డొంకేశ్వర్ (13 గ్రామాలు), సాలూరా (12 గ్రామాలు), పొతంగల్ (15 గ్రామాలు), కామారెడ్డి జిల్లాలో పాల్వంచ (12 గ్రామాలు), డోంగ్లి (13 గ్రామాలు), మహ్మద్‌నగర్ (13 గ్రామాలు) మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.