Nizamabad | భిక్కనూరు ఏప్రిల్ 21 : ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే నూతన నియమకాలు చేపట్టాలని తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణ కాంట్రాక్ట్ అధ్యాపకులు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని వేడుకున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ప్రాంగణానికి సోమవారం వచ్చారు.
ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులు ఆయనకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో 1100 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారని, విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో దశాబ్ధాలుగా కీలక పాత్ర పోషిస్తున్నారని, ఒకవైపు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు విద్య నందిస్తూ, అంతేకాకుండా అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిపాలన బాధ్యతలను సైతం నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ నాయకులు డాక్టర్ నారాయణ గుప్తా, డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత నోటిఫికేషన్ కు వెళ్లాలని కోరారు.
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ద్వారా సీఎం శ్రీ రేవంత్ రెడ్డికి విన్నపించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని తొందరలో సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరసయ్య, డాక్టర్ రమాదేవి, శ్రీకాంత్, డాక్టర్ నిరంజన్, దిలీప్, డాక్టర్ సరిత, తదితరులు పాల్గొన్నారు.