వానకాలం వడ్లు కాంటా పడడం లేదు. కల్లాలు దాటడం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి మాత్రమే పరిమితమయ్యాయి. వడ్ల సేకరణ మొదలు కాకపోవడంతో ఏ రోడ్డు మీద చూసినా ధాన్యం రాశులే దర్శనమిస్తున్నాయి. పుట్ల కొద్దీ వడ్లతో రహదారులన్నీ నిండిపోయాయి. పదిహేను రోజుల నుంచి కల్లాలు, రోడ్లపైనే ధాన్యం కుప్పలు ఉంటున్నా..సేకరణ ప్రక్రియపై సర్కారు నుంచి స్పష్టత కరువైంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని రైతులకు పడిగాపులతోపాటు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో చేతలకు పొంతనలేకుండా పోయిందంటూ రైతాంగం అసహనం వ్యక్తం చేస్తున్నది.
-నిజామాబాద్, అక్టోబర్ 29, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ప్రతిరోజూ వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు మార్కెట్కు వస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు పుట్లకొద్దీ ధాన్యం తరలిస్తున్నా..కొనేవారు కరువయ్యారు. దళారులు, వ్యాపారులను మినహాయిస్తే .. ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో సేకరణపై ఎలాంటి స్పష్టత లేకుండాపోయింది. ధాన్యం కుప్పలను అకాల వర్షాలకు తడవకుండా చూసుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఏ వాన వచ్చి నష్టాన్ని తీసుకు వస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వందలాది కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఉమ్మడి జిల్లాలో యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. 18లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడులు వస్తాయని అంచనా వేసింది. కానీ ఇంతవరకూ కొనుగోళ్ల ప్రక్రియంలో వేగం పుంజుకోకపోవడం గమనార్హం. సర్కారు నిర్లక్ష్యం మూలంగా రైతులు ఎదురుచూపులకు చెక్ పెట్టి దళారులు, వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఎంతో కొంతకు ముట్టజెప్పి అదే పదివేలు అన్నట్లుగా స్వల్ప గిట్టుబాటుతోనే మిన్నకుండిపోతున్నారు.
అకాల వర్షానికి పంటను నష్ట పోయే బదులు ప్రైవేటుకు అమ్ముకోవచ్చనే ఆలోచనతో చాలా మంది రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఇదే అదనుగా కల్లాలు, రోడ్లపై వాలుతున్నారు. సన్నరకం వడ్లను కూడా రూ.2వేల వరకే చెల్లించి రైతులకు నష్టం చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, బి గ్రేడ్ రకానికి రూ.2300 చొప్పున దక్కుతుండగా.. దళారులు మాత్రం తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారు. రేవంత్ సర్కారు ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు అదనంగా రూ.500 అందాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభిస్తున్నా.. గింజ మాత్రం కొనడం లేదు. ఒక రైతు తన పొలంలో పంట కోయగానే టోకెన్ పొంది వరుస క్రమంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు సిద్ధం అవుతాడు. ఇదీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రక్రియ. టోకెన్ సిస్టంతో ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. పైరవీలకు ఆస్కారం ఉండదు. కానిప్పుడు టోకెన్ సిస్టమే కనిపించడం లేదు. నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా లక్షా 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పోగై ఉన్నట్లుగా తెలుస్తోంది. కామారెడ్డిలోనూ లక్షా మెట్రిక్ టన్నులు ధాన్యం రోడ్లపైనే పరుచుకున్నట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లాలో 420 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. సన్నాల సేకరణ లక్ష్యం రెండు లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 4.80లక్షల మెట్రిక్ టన్నులు ఉండొచ్చని అంచనాలున్నాయి. కానీ ఇంతవరకూ ధాన్యం బస్తాలు ఎత్తిందీ లేదు. రైతుల నుంచి సేకరించిందీ కనిపించడంలేదు. నిజామాబాద్ జిల్లాలో ఈ వానకాలంలో 12లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనా వేశారు. 2లక్షల మెట్రిక్ టన్నులు బహిరంగ మార్కెట్లో వ్యాపారులు సేకరించగా, మరో 2లక్షల మెట్రిక్ టన్నులు రైతులు తమ అవసరాల కోసం నిల్వ చేసుకుంటు న్నారు. మిగిలిన 8లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. 480 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహం చేసి ప్రారంభిస్తున్నారు. సన్న వడ్లను కొలిచేందుకు క్యాలిపర్లను సైతం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ సేకరణలో నెలకొన్న జాప్యం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కొనుగోళ్లపై తాత్సారం చేస్తుండడంతో విసుగుచెందిన రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతులే స్వచ్ఛందంగా వ్యాపారుల వద్దకు వెళ్లాల్సినంత అవసరాన్ని సర్కారు నిర్లక్ష్యం ఉసిగొల్పుతున్నది. అధికారంలోకి వస్తే క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన మాట నెరవేర్చాలంటే భారీగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నమే చేయడంలేదు. దీంతో ఎగవేతలో భాగంగానే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రామారెడ్డి, అక్టోబర్ 29: అకాల వర్షాలు అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టక పోవడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. కాంటాలు వేయక పోవడంతో ఉమ్మడి జిల్లాలో ధాన్యం రాసులు రోడ్లు, కల్లాల్లోనే పేరుకు పోయాయి. అయితే, మంగళవారం రామారెడ్డి తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో వడ్లు తడిసి పోయాయి. కుప్పల్లోంచి వరదనీరు ప్రవహించడంతో ధాన్యం కొట్టుకుపోయింది. పంటను కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడ్డా ఫలితం లేకపోయింది. తడిసిన వడ్లను చూసి కన్నీటి పర్యంతమైన కర్షకులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. పంట కోసి, ఆరబెట్టి 20 రోజులైనా కాంటాలు వేయక పోవడం వల్లే తమకీ దుస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. పండించిన పంటను అమ్ముదామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కొన్ని గ్రామాల్లో ఏదో తూతూ మంత్రంగా కేంద్రాలను ఏర్పాటు చేసినా..వడ్లను కొనడంలేదు. వడ్లు కేంద్రాల్లో రోజుల తరబడి ఉండడంతో దళారులకు అమ్మినం. సరైన ధర రాక మేము నష్టపోయినం.
-మాముళ్ల శ్రీనివాస్, రైతు, చందూర్
నాకున్న రెండెకరాల్లో పండించిన పంటను అమ్ముదామంటే ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు పొలాల వద్దకే వస్తున్నారు. కోసిన వరి పంటను ఎండ పెట్టలేక, వాతావరణం సహకరించక పోవడంతో తక్కువ ధరకే ధాన్యం అమ్మి నష్టపోయినం.
– బర్ల పోశెట్టి, చందూర్
అకాల వర్షాలతో పంటంతా నేల పాలయ్యింది. మిగిలిన వరి గింజలను కోసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముదామంటే వాటిని ఇంకా ప్రారంభించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఇవ్వాలి.
-కోటగిరి రాములు, లక్ష్మాపూర్ గ్రామం, చందూరు మండలం