వినాయక్‌నగర్, జూన్ 12: కమిషనరేట్ పరిధిలో ఈనెల 21న రీ-ఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిటిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ యూజీ -2026 నిర్వహించనున్నట్లు కామారెడ్డి ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ రాజేశ్ చంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద పోలీసులు అవసరమైన భద్రత చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు షిప్ట్లుగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. పరీక్ష రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్ల పరిసర ప్రాంతా ల్లో సెక్షన్ 163 అమలులో ఉంటుందని వెల్లడించారు. 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపుగా ఉండరాదని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాప్స్ మూసి ఉంచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెంటర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.