ఖలీల్‌వాడి/బోధన్/వినాయక్‌నగర్, మే 4: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా నిర్వహించారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 3,398 మందికి 3,298 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. వంద మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో నాలుగు, డిచ్పల్లి, బోధన్‌లో రెండు చొప్పున మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేశారు. బందోబస్తు ఏర్పాట్లతోపాటు పరీక్షా కేంద్రాలను సీపీ సాయి చైతన్య పరిశీలించారు.
బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. నిబంధనల మేర కు సమయానికి విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు పంపిన అనంతరం గేట్లకు తాళం వేయించారు. కాగా, ఓ విద్యార్థిని, మరో ఇద్దరు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి రాగానే అక్కడ తాళాలు వేసి ఉండడం చూసి తమను లోనికి పంపాలంటూ అభ్యర్థించారు. అయినా అనుమతించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేయడంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. సదరు విద్యార్థులకు పోలీసులు నచ్చజెప్పి తిప్పి పంపారు.