బాన్సువాడ, జూలై 17: బాన్సువాడ పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు స్థానిక కల్కి చెరువు సమీపంలో నిర్మిస్తున్న మల్లీజనరేషన్ పార్కును త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పార్కు నిర్మాణ పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్, అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ పట్టణ సుందరీకరణలో భాగంగా రూ.4 కోట్లతో మల్టీజనరేషన్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో టీయూఎఫ్ఐడీసీ పథకం కింద మంజూరు చేసిన నిధులతో ఈ పనులు చేపట్టినట్లు చెప్పారు. ఇందులో ఉమెన్, సీనియర్ సిటిజన్, చిల్డ్రన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వాకింగ్, యోగా, ధ్యానం చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
రెస్టారెంట్‌తోపాటు పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్న ఇలాంటి పార్కు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేదని తెలిపారు. కుటుంబ సభ్యులతో వచ్చి ప్రశాంతంగా సేద తీరడానికి ఈ పార్కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్పీకర్ వెంట రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, ఆత్మ కమిటీ అధ్యక్షుడు మోహన్‌నాయక్, గూల సత్యం, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ట్రాన్స్‌కో ఏఈ నాందేవ్, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్, ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, వర్ని గోపాల్, రాం బాబు, కౌన్సిలర్లు ఆమేర్ చావూస్, బాడి శ్రీని వాస్, నర్సుగొండ, హైమద్ తదితరులున్నారు.