ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 22 : సీఎం రేవంత్‌రెడ్డి మాలలను అణిచివేస్తున్నారని జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. ఉమ్మడి జిల్లా జాతీయ మాలమహానాడు సమావేశాన్ని నిజామాబాద్‌లోని సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుడు పులి జైపాల్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పిల్లి సుధాకర్ హాజరై మాట్లాడారు.
మాలల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందన్నారు. మందకృష్ణ మాదిగ బెదిరింపులకు సీఎం రేవంత్‌రెడ్డి భయపడి, మాలల్ని దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. జస్టిస్ షమీం అక్తర్‌తో తప్పుల తడకగా నివేదికను రూపొందించారన్నారు. రిపోర్టు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. మాల ఉపకులాల మధ్య మందకృష్ణ మాదిగ చిచ్చు పెట్టి మాలలపై విషం చిమ్ముతున్నాడని, ఈ పద్ధతి మార్చుకోవాలని అన్నారు. అనంతరం జాతీయ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా పులిజైపాల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఎబినైజర్ను నియమించారు.