మోర్తాడ్, ఆగస్టు 4: రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా ఉన్న మెండోరా మండలం పోచంపాడ్‌లోని జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఈసారి దయనీయంగా మారింది. ప్రభు త్వం ఏటా చేపపిల్లల ఉత్పత్తికి ఏప్రిల్-మే నెలల్లోనే నిధులను విడుదల చేసేది. దీంతో పనులు వేగంగా ప్రారంభమై సమయానికి చేపపిల్లలను ఉత్పత్తి చేసి మత్స్యకారులకు పంపిణీ చేసేవారు. కానీ ఈసారి నిధులు విడుదల కాకపోవడం శోచనీయం. ఏప్రిల్-మే నెలల్లో తల్లి చేపలను కొనుగోలు చేసి జూలైలో మొదటివారంలో చేపపిల్లల ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తారు. ఆగస్టు నెల ప్రారంభమైనా చేపపిల్లల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కాకపోవడం పలు అనుమానాలు రేకేత్తుతున్నాయి.
పోచంపాడ్ వద్ద 32ఎకరాల్లో 254 నర్సరీలతో ఏర్పా టు చేసిన జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి ఏటా సకాలంలో నిధులు విడుదలయ్యేవి. నిధులు విడుదల కాని సమయంలో చేపపిల్లల ఉత్పత్తికి అధికారులే డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితులు ఉండడంతో అధికారులు ఇక్కడకు రావడం లేదని, ఇన్చార్జిగా నియమించిన అధికారి సెలవుపై వెళ్లడానికి కారణం కూడా అదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చేపపిల్లల ఉత్పత్తికి ఏప్రిల్-మే నెలల్లో తల్లిచేపల ను సమీప చెరువుల నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చి మట్టిపాండ్లో ఉంచుతారు. ఈసారి ఎనిమిది క్వింటాళ్ల తల్లి చేపలను (బంగారుతీగ, బొచ్చ, రవ్వ రకాలు)కొనుగోలు చేశారు.
ఈసారి 55లక్షల చేపపిల్లలు(అడ్వాన్స్డ్ ఫ్రై) ఉత్పత్తి లక్ష్యం కాగా ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభం కాలేదు. 55లక్షల చేపపిల్లలను ఉత్పత్తికి 7.50కోట్ల స్పాన్లను పెంచాల్సి ఉంటుంది. ఇదంతా జూలై మొదటి వారంలోనే ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటికీ మొదలు కాకపోవడంతో ప్రస్తుతం వాతావరణం అనుకూలిస్తుందా అనేది ప్రశ్నార్థకం మారింది. ఎకోహెచరీలను అమర్చాలి, తల్లిచేపలకు ఇంజెక్షన్లు ఇచ్చి నర్సరీల్లోకి వదలాలి, ఇవన్నీ జరగాలంటే నిధులు రావాల్సి ఉన్నది. ఇప్పటికీ తీసుకువచ్చిన తల్లిచేపల బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపల ఉత్పతి కేంద్రా న్ని అభివృద్ధి చేసేదిశగా అడుగులు పడ్డాయి. మొదట 114 నర్సరీలు ఉండగా రూ.5కోట్లతో అదనంగా 140 నర్సరీలు, ట్రాన్స్ఫార్మర్, పైప్‌లైన్, ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణం చేపట్టి 2019లో అందుబాటులోకి తీసుకొచ్చారు. చేపపిల్లల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు నర్సరీలు నిర్మించినా.. ఈసారి మాత్రం నిధులు విడుదల కాక ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.