అక్రమ సంపాదన కోసం కొందరు యువతను మత్తులో ముంచుతూ వారి భవిష్యత్తును చిత్తు చేస్తున్నారు. చదువుకునే వయస్సులోనే గంజాయివైపు మళ్లించి మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంచడంతో యువకులు చెడు వ్యసనం బారిన పడుతున్నారు. గంజాయి లేకుండా ఉండలేకపోతున్నారు. ఇందుకోసం ఎన్ని డబ్బులైనా ఖర్చుచేస్తున్నారు.
గంజాయి వ్యాపారానికి నందిపేట్ అడ్డాగా మారింది. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు గంజాయి పట్టుబడడం మండలంలో కలకలం రేపుతున్నది. ఇటీవల ఎనిమిదిన్నర కిలోలు పట్టుపడగా, తాజాగా బుధవారం మూడున్నర కిలోల గంజాయి పట్టుబడింది. నందిపేట్ మండల కేంద్రంలో కొన్ని పాన్ షాపులు, చాయ్ హోటళ్లు గంజాయి విక్రయాలకు అడ్డాగా మారాయి. ఉమ్మెడ వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మించిన తర్వాత మహారాష్ట్ర ప్రాంతానికి రాకపోకలు పెరిగాయి. నిత్యం వందలాది వాహనాలు వస్తూపోతుంటాయి. అప్పటినుంచి గంజాయి రవాణా పెరిగింది. దీంతోపాటు చోరీలు కూడా పెరిగాయి. నిత్యం ఏదో ఓ చోట దొంగతనం లేదా బైక్ అపహరణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చోరీ చేసిన బైక్‌లను సునాయసంగా వంతెన మీదుగా రాష్ర్టాన్ని దాటిస్తున్నారు.
గంజాయి సేవించేవారు నిర్మానుష్య ప్రాంతాలును ఎంచుకొని గుంపులుగా వెళ్లి అక్కడ గంటలపాటు గడుపుతున్నారు. జన సంచారం లేకపోవడంతో భయం లేకుండా గంజాయి సేవిస్తున్నారు. ఉమ్మెడ గుట్ట ప్రాంతం, లక్కంపల్లి శివారులోని సెజ్ సమీపంలోని అంతర్గత రోడ్లు, మైదాన ప్రాంతాల్లోకి వెళ్లి మత్తులో జోగుతున్నారు. వివేకానంద చౌరస్తా, ఆర్మూర్ బైపాస్ రోడ్డు ప్రాంతాలతోపాటు పలు పాన్ షాపులు, హోటళ్లు, వైన్ షాపులకు సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా 20 నుంచి 25 ఏండ్లలోపు యువకులే గంజాయికి బానిసలుగా మారారని తెలుస్తున్నది. ఇద్దరు ముగ్గురు కలిసి గంజాయిని కొనుగోలు చేసుకొని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిపోతున్నారు.
పని లేకున్నా యువకులు అర్ధరాత్రి వరకూ రోడ్లపైనే కనిపిస్తున్నారు. ప్రత్యేకంగా అడ్డాలను ఏర్పాటుచేసుకొని రాత్రి ఒంటిగంట వరకు అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటున్నారు. ఆర్మూర్ బైపాస్ రోడ్డు, హనుమాన్గల్లీ, రాజానగర్ ప్రాంతలోని చిన్నచిన్న కిరాణా దుకాణాలను అర్ధరాత్రి రాత్రివరకూ తెరిచి ఉంచుతున్నారు. దీంతో కొందరు ఆయా ప్రాంతాల్లో మకాం వేసుకొని ఉండిపోతున్నారు. రోడ్డు పక్కన ఉండే కల్వర్టుల వద్ద అడ్డాలు వేస్తున్నారు. హనుమాన్ గల్లోని ఓ వాటర్ ప్లాంట్, డీజే సెంటర్ ఉన్న చోట నిత్యం పదుల సంఖ్యలో యువకులు రాత్రి రెండు గంటలవరకూ తిరుగుతున్నారు. స్థానికులు వారిని నిలదీసినా తీరుమారడం లేదని అంటున్నారు.
నందిపేట్‌లో రోజురోజుకూ చోరీలు పెరుగుతున్నాయి. వారంలో నాలుగైదు ద్విచక్రవాహనలు అపహరణకు గురవుతున్నాయి. వివేకానంద చౌరస్తాలో పార్క్చేసిన ఓ బైక్‌ను దొంగలు పట్టపగలే చోరీకి ప్రయత్నించారు. నిందితులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. గత నెల అంగడి రోజు మూడు బైక్‌లను దొంగలు ఎత్తుకెళ్లారు.
నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తావద్ద పోలీసులు బుధవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా మూడున్నర కిలోల గంజాయి పట్టుబడింది. నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్‌కు చెందిన జిలకర ప్రసాద్, విద్యాసాగర్ బైక్‌పై గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్సై రాహుల్ తెలిపారు.
పెద్దకొడప్గల్, జనవరి 24: మండలంలోని అంజని గ్రామానికి చెందిన నర్మల్ హన్మాండ్లు ఇంట్లో 800 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు అబ్కారీ సీఐ సత్యనారాయణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బిచ్కుంద అబ్కారీ పోలీసులు బుధవారం దాడి చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఆయన వెంట అబ్కారీ ఎస్సై అభిశేఖర్,హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య, కానిస్టేబుల్ పరశురాం,నవీన్ రెడ్డి, శ్రీధర్, అనిత, ప్రేమలత ఉన్నారు.