రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం దళితుల స్వయంఉపాధికి రాచబాట వేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో దళిత సమాజం విముక్తి పొందడానికి తెలంగాణలో వెలుగుదారులు పడుతున్నాయని పేర్కొన్నారు. దళితబంధు లాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని జీవన్‌రెడ్డి చెప్పారు. చేతులు జోడించి నిలిచే రోజులు ఇక చెల్లవని.. ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబనతో బంగారు భవిష్యత్తుకు బాటలు పడుతాయని తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందనుండడంతో వారే ఇతరులకు పని కల్పించేస్థాయికి చేరుకుంటారన్నారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు ఓ సామాజిక విప్లవంగా ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జీవన్‌రెడ్డి అభివర్ణించారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అంబేద్కర్ స్ఫూర్తితో దళిత సమాజం విముక్తి పొందడానికి తెలంగాణలో వెలుగుదారులు పడుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. దళితుల్లో పేదరికాన్ని శాశ్వతంగా తరిమి కొట్టాలనే సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో దళితబంధు పథకం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందనుండడంతో దళితులు ఇక సగర్వంగా తలెత్తుకుని తిరిగే సామాజిక పరిస్థితులు రాబోతున్నాయన్నారు. ఇక దళితులు ఉపాధి కోసం ఇతరుల వద్ద చేతులు జోడించి నిలిచే పరిస్థితులు పోయి, వారే ఇతరులకు పని కల్పించే స్థితి ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. ఇది ఒక రకంగా సామాజిక విప్లవమని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మార్చి నెలాఖరులోగా 100 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తవుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత మందికి మేలు జరుగుతుందని చెప్పారు.
ఎమ్మెల్యే : దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా… మహా అద్భుతంగా దళితబంధు పథకాన్ని తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. ఆయన దళితుల పాలిట దేవుడయ్యారు. దళితబంధు ఒక్కటే కాదు. ఇలాంటివి అనేక పథకాలు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేవంటే అతిశయోక్తి కాదు.
రాష్ట్రంలో 40లక్షలున్న దళిత సమాజానికి బడ్జెట్లో రూ.20వేల కోట్లు పెట్టబోతున్నాం. దేశంలో 28శాతం అంటే దాదాపు 50కోట్లు ఉన్న దళితులకు బీజేపీ ప్రభుత్వం కేటాయించిన నిధులు రూ.12వేల కోట్లు మాత్రమే. మాటలు చెప్పే భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధికి… బాధ్యత గల తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న తేడాను మీరే గమనించవచ్చు. రైతుబంధుతో రైతులకు బంధువయ్యారు కేసీఆర్. ఇప్పుడు దళితబంధుతో దళితులకు బంధువు కాబోతున్నారు మన ముఖ్యమంత్రి. బీజేపీకి దమ్ముంటే వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో దళితబంధు అమలుచేయాలి. దళితుల మీద ప్రేమ, రాజ్యాంగంపైన గౌరవం ఉంటే అట్టడుగు ప్రజల మేలు కోసం కదిలి రావాలి. మోదీకి రైతులంటే పడదు. దళితులంటే గిట్టదు. పేద ప్రజలంటే అసలు సోయి లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో చేతి వృత్తుల విధ్వంసం జరిగింది. నాటి వ్యవసాయ సంక్షోభానికి మూల కారణం కూడా వృత్తుల విధ్వంసమే. రాష్ట్ర అవతరణ తర్వాత సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో కుల వృత్తులకు ఆదరణ మళ్లీ ప్రారంభమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి, పరిపుష్టి ఈ వృత్తుల మీదే ఆధారపడి ఉన్నది. కుల వృత్తులను ప్రోత్సహించడమంటే గ్రామీణ సంస్తృతిని పునరుజ్జీవింప జేయడమే.
ప్రతిపక్షాలకు ఎన్నడు లేనిది దళిత, గిరిజనుల మీద, బడుగుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. సంక్షేమ పథకాలపై విపక్షాలు చేస్తున్న గోల అంతా ఇంతా కాదు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ర్టాల్లో 85శాతం ఉన్న అట్టడుగు వర్గాల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో చెప్పడం లేదు. కానీ ఇక్కడ దళిత బంధు పథకంపై రంధ్రాన్వేషణతో విష ప్రచారంతో కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, దళితబంధు అమలు చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. కాబట్టి అది సాధ్యమయ్యే పనికాదంటున్నారు. ఇది వారి అవగాహన లోపంగానే భావించాలి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఏ పథకం కూడా మధ్యలో ఆపలేదనే దానికి ఈ ఏడున్నరేండ్ల పాలనే సాక్ష్యం. రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, అనేక సంక్షేమ పథకాలు దేశానికే తలమానికంగా నిలిచాయి.
ఆర్మూర్, నందిపేట, మాక్లూర్తో పాటు ఆర్మూర్ మున్సిపాలిటీల్లో ఇప్పటికే దళిత జనాభా వివరాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అధ్యయనం పూర్తయ్యింది. పేద కుటుంబాలకు రూ.10లక్షలతో కుటుంబ పోషణకు స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకునే సౌలభ్యం దొరుకుతుంది. సొంతంగా పైసా పెట్టుబడి అవసరం లేకుండానే, బ్యాంకులతో సంబంధం లేకుండానే… నేరుగా వంద శాతం ప్రభుత్వమే నిధులు కేటాయించి వారి ఉపాధికి బాటలు వేయడం గొప్ప విషయం.
నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆర్మూర్ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ శ్రమజీవులే ఎక్కువ. వ్యవసాయమే ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తుంటారు. ఈ ప్రాంత ప్రజల మేలు కోసం అహర్నిశలు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం మంజూరు చేసిన 100 యూనిట్లు దళితబంధును నియోజకవర్గంలో గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాం. వీరందరికీ మార్చి నెలాఖరులోగా యూనిట్లు గ్రౌండింగ్ కూడా పూర్తి చేయబోతున్నాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకం మరింత వేగం పుంజుకుంటుంది. మరింత ఎక్కువ మందికి పథకాన్ని మంజూరు చేసి చూపిస్తాం.