మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు తోడుగా వచ్చి ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి స్వాగతం పలుకుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ పాలనకు జేజేలు కొడుతున్నారు. గులాబీ పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలనే కసి కార్యకర్తలతోపాటు సామాన్య ఓటర్లలోనూ కనిపిస్తున్నది. ఉదయం 7గంటల నుంచే టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ శ్రేణులు కదనరంగంలోకి దిగుతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీలో చేరిన మోసకారి రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు కూడా స్వచ్ఛందంగా గులాబీ పార్టీలో చేరుతున్నారు.
ప్రచారంలో గులాబీ సేన దూసుకెళ్తున్నది. శనివారం రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి, కమ్మగూడలో ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్ మండలంలోని డి.నాగారంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రచారం చేశారు. నారాయణపురం మండలంలో మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వేర్వేరుగా పాల్గొన్నారు. నారాయణపురం మండలంలోని అహ్మదాబాద్, కోతులారం, గుడిమల్కాపూర్‌లో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ప్రచారం చేశారు. నాంపల్లి మండలంలోని లింగోటంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నాంపల్లి మండల కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చండూరు మండలంలోని బంగారిగడ్డలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పుల్లెంలలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, చండూరు మున్సిపాలిటీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మునుగోడు మండలంలోని చీకటిమామిడిలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే హన్మంత్ షిండే, మర్రిగూడెం మండలంలోని అజ్జలాపురంలో ఇబ్రహీంపట్రం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.