సంస్థాన్‌నారాయణపురం, సెప్టెంబర్ 2 : మునుగోడులో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాయేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం మీద రోజురోజుకూ విశ్వసనీయత పెరుగడమే అందుకు నిదర్శనమన్నారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని సంస్థాన్‌నారాయణపురం టీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం సాయంత్రం పుట్టపాక గ్రామంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో కాషాయ పార్టీ కనుచూపు మేరలో లేదని, ఉంటే గింటే అంతో ఇంతో పోటీనిచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. అన్ని సర్వేలు ఇదే పరిస్థితిని ఉటంకిస్తున్నాయన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ప్రస్తుతం ఆ పార్టీ పతనం అంచుకు చేరడంతో రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల కోసం కాషాయ కండువా కప్పుకొన్నారని విమర్శించారు. ఆ అన్నాదమ్ముళ్లవి మొదటి నుంచి లోఫర్ మాటలు, బ్రోకర్ దందాలు అని దుయ్యబట్టారు. ఆ బ్రోకర్ దందాల మాదిరిగానే నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ క్యాడర్, లీడర్లను బేరమాడి బీజేపీలోకి తీసుకెళ్లాలి అనుకుంటే అది కాస్తా రివర్స్ అయ్యి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. అబద్దాలు చెప్పడంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ను మించినోళ్లు భూప్రపంచంలోని పేర్కొన్నారు. మూడేండ్లుగా బీజేపికి కోవర్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీ రహస్యాలను ఆ పార్టీకి మోసిన రాజగోపాల్‌రెడ్డి అంతిమంగా కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుని బీజేపీలో చేరారన్నారు.
రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వివక్ష లేకుండా అన్ని నియోజకవర్గాలకు సరిసమానంగా నిధులు మంజూరు చేసిందని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య అధ్యక్షత జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్‌చందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.