బాన్సువాడ టౌన్, ఆగస్టు 6: బాన్సువాడ మినీ ట్యాంక్‌బండ్ సమీపంలో నిర్మాణం దైనందిన జీవితంలో బాన్సువాడ పట్టణవాసులు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి పచ్చదనం.. ఆహ్లాదం పంచేలా రాష్ట్ర ప్రభుత్వం మల్టీజనరేషన్ పార్కును నిర్మిస్తున్నది. పిల్లలు, పెద్దలకు ఉపయోగపడేలా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో రూ.4కోట్లతో కల్కి చెరువు సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, అందమైన కళాకృతులను ఏర్పాటు చేసిన ఈ పార్కు త్వరలోనే ప్రారంభం కానున్నది.
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. నిత్యం వాహనాల సౌండ్స్, వాయు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రశాంతమైన జీవనానికి ప్రజానీకం దూరమవుతున్నారు. వీటన్నింటికీ చెక్‌పెడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే బాన్సువాడ పట్టణ సమీపంలో మల్టీజనరేషన్ పార్కును నిర్మిస్తున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేటాయించిన ప్రత్యేక టీయూఎఫ్ఐడీసీ నిధులతో పట్టణ పరిధిలో సుమారు మూడు ఎకరాల స్థలంలో రూ.4కోట్లతో నిర్మిస్తున్న ఈ పార్కు ప్రారంభానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. అందమైన కళాకృతులను పార్కులో ఏర్పాటు చేశారు. బాన్సువాడ సుందరీకరణలో భాగంగా కల్కీ చెరువు(మినీ ట్యాంక్‌బండ్)ను ఆనుకొని నిర్మించిన ఈ పార్కు ఔరా అనేలా కనువిందు చేస్తున్నది.
ఆకట్టుకునేలా..
పార్కుకు వచ్చే ప్రజలను ఆకట్టుకునేలా స్వాగత తోరణాన్ని నిర్మించారు. పార్కులో ఏర్పాటు చేసిన వివిధ కళాకృతులు మరింత వన్నె తెస్తున్నాయి. చుట్టూరా పచ్చని మొక్కలు, గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. యువతకు నచ్చేవిధంగా సెల్ఫీ స్పాట్లను కూడా నిర్మించారు. ఐ లవ్ బాన్సువాడ అనే ఆంగ్ల అక్షరాలతో కూడిన లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.
పెద్దలకు ఉపయోగపడేలా..
పెద్దలకు ఉపయోగపడేలా పార్కులో చక్కని వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 700 మీటర్ల నడకదారికి ఇరువైపులా ఆహ్లాదం పంచేలా మొక్కలను నాటారు. దీంతో మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధిగ్రస్తులకు నడకదారి దోహదపడుతుంది. యువకులకు ఉపయోగపడేలా ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేశారు.
చిన్నారుల్లో జోష్..
చిన్నారులను మంత్రముగ్ధులను చేసేలా పార్కులో చిల్డ్రన్స్ జోన్‌ను నిర్మించారు. ఆట బొమ్మలు, వన్యప్రాణుల బొమ్మలను ఏర్పాటు చేశారు. చిన్నారులు ఆడుకునేందుకు అనువుగా ఉండేలా పరికరాలను తీసుకొచ్చారు.
విశ్రాంతినిచ్చే కుటీరాలు..
పార్కును సందర్శించే ప్రజలు సేదతీరేందుకు ప్రత్యేక కుటీరాలను నిర్మించారు. గొడుగు ఆకృతులతో పోలిన విశ్రాంత మందిరాలు చూడముచ్చటగా ఉన్నాయి. అందమైన పూలమొక్కల వనం మధ్యలో బుద్ధుని విగ్రహం, కుటుంబసమేతంగా కూర్చునేలా రౌండ్ టేబుల్స్, యోగా స్థలాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
బాన్సువాడకు మణిహారం..
బాన్సువాడ పట్టణానికి మణిహారంలా ఈ మల్టీజనరేషన్ పార్కు నిలుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే విశాలమైన, అత్యా ధునిక వసతులు, అందమైన కళాకృతులతో నిర్మిస్తున్నాం. తుది మెరుగులు దిద్దుకుంటున్నది. అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. పార్కుకు వచ్చే ప్రజల సౌకర్యార్థం బాన్సువాడ ప్రధాన రహదారి నుంచి పార్కు వరకు నూతనంగా డబుల్ బీటీ రోడ్డును నిర్మిస్తున్నాం.
– పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్
స్పీకర్ పోచారం, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు
బాన్సువాడ పట్టణ వాసులకు ఆహ్లాదం పంచేందుకు పార్కు నిర్మాణానికి కృషి చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు. మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించి అద్భుతంగా మల్టీ జనరేషన్ పార్కును ఏర్పాటు చేయడం పట్టణ ప్రజల అదృష్టం.
– జంగం గంగాధర్, మున్సిపల్ చైర్మన్, బాన్సువాడ
పర్యాటక ప్రదేశంగా బాన్సువాడ..
రానున్న రోజుల్లో బాన్సువాడ పట్టణం పర్యాటక ప్రదేశంగా నిలుస్తుంది. అందులో ముఖ్యమైనదిగా ఈ మల్టీజనరేషన్ పార్కు. ఆరోగ్యకరమైన వాతావరణంలో అందమైన కళాకృతులతో ఈ పార్కును నిర్మించాం. పట్టణవాసులు కుటుంబసభ్యులతో కలిసి వచ్చి సేదతీరేందుకు అనువైన ప్రదేశంగా నిలుస్తుంది.