నిజామాబాద్, సెప్టెంబర్ 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ప్రక్రియ ముగిసింది. సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ ఓటరు జాబితాను పంచాయతీ అధికారులు విడుదల చేశారు. తాజాగా బుధవారం(సెప్టెంబర్ 10న) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటరు తుది ఓటరు జాబితా విడుదలైంది. ఈ మేరకు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జాబితాను ప్రజా బాహుళ్యంలో పెట్టారు. జీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు సంఖ్యలో ఎలాంటి మార్పులు, చేర్పులు చోటు చేసుకోలేదు. ముసాయిదాలో వెల్లడించిన వివరాలనే అచ్చు గుద్దినట్లుగా తుది జాబితాలోనూ ప్రచురించారు.
మార్పులు, చేర్పులు, తప్పుల సవరణ కోసం అనేక చోట్ల దరఖాస్తులు వచ్చినప్పటికీ ఓటరు లిస్ట్‌లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం విడ్డూరంగా మారింది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వాహణలో ఏర్పాటు చేయబోయే పోలింగ్ బూత్ వివరాలు సైతం వెల్లడయ్యాయి. ఈ సారి నిజామాబాద్ జిల్లాలో 31 జడ్పీటీసీ, 307 ఎంపీటీసీ స్థానాలు, కామారెడ్డి జిల్లాలో 25 జడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 545 సర్పంచ్ స్థానాలు, 5022 వార్డు సభ్యులకు పోరు జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో 532 సర్పంచ్ స్థానాలు, 4656 వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహించబోతున్నారు.
స్థానిక పోరులో విజేతలను నిర్ణయించే అధికారం కేవలం మహిళా ఓటర్ల చేతుల్లోనే ఉంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు గెలవాలంటే మహిళామణుల ఆశీస్సులు దక్కించుకోవాల్సిందే. మండలాల వారీగా తుది ఓటరు జాబితాను పరిశీలిస్తే మహిళల సంఖ్యనే ఎక్కువగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో 8.51లక్షల మంది మొత్తం ఓటర్లకు మహిళలు అత్యధికంగా 4.54లక్షల మంది ఉన్నారు.
పురుషులు 3.96లక్షల మందికే పరిమితం అయ్యారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 6.39లక్షల మంది ఓటర్లకు మహిళలు అత్యధికంగా 3.32లక్షల మంది ఉండగా పురుషులు 3.07లక్షల మందికే పరిమితం అయ్యారు. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో ఏడాదిన్నర కాలంగా పాలన కుంటుపడింది. ప్రత్యేక అధికారుల చేతుల్లోనే స్థానిక సంస్థలు కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరిగి పోతున్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కారు కాలాయాపనకే పరిమితమైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు ముగించాల్సి ఉంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే తుది ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులు ఉండటంతో పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరులో చేదు అనుభవం తప్పదనే కారణంతో సీఎం రేవంత్ రెడ్డి వెనుకడుగు వేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.