బాన్సువాడ రూరల్ : ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ సూచించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శులు సురేష్, శ్రీధర్ రెడ్డి, నాగరాజులకు ఆదేశాలు ఇచ్చారు. బుధవారం మండలంలోని రాంపూర్, రాంపూర్ తాండ, పులిపుర్చతాండ గ్రామాలలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లోని నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను ఆయన పరిశీలించారు. వేసవి కాలం నర్సరీలలో మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉందని, మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు నీళ్లు పట్టించాలని అన్నారు. చెత్తా, చెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా డంపింగ్ యార్డులలోనే వేసేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శలకు సూచించారు.
గ్రామంలో ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. పని అడిగిన ప్రతి కూలీకి పని కల్పించాలని, జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి 100 రోజుల పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.