వినాయక నగర్, జనవరి 29: ప్రస్తుత సీజన్లో పసుపు ధర ఆశాజనకంగా ఉన్నదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గిస్తే సహించబోమని హెచ్చరించారు. సోమవారం ఆయన అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డితో కలిసి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. పసుపు కొనుగోళ్ల పై రైతులు,వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో సమీక్ష నిర్వహించారు.నాణ్యమైన పసుపు సాగు దిశగా రైతులు దృష్టి సారించాలని, ఎండిన పసుపును మాత్రమే మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. కొత్త పంటకు 10 శాతం తేమతో ఈ నెల 25 వరకు రూ.10,890 ధర ఉండగా..పాత పసుపునకు రూ.13 వేలు పలికినట్లు తెలిపారు.
పసుపు బోర్డు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానున్నదని, మంచి పంట పండిస్తే రానున్న మూడేండ్లలో ధర మూడింతల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎగుమతులు కూడా పెరుగుతాయన్నారు.ఆశించిన ధర వస్తే రైతులు, వ్యాపారులకు లాభాలు వస్తాయని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, కార్పొరేటర్లు, మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లబిశెట్టి శ్రీనివాస్, కార్యదర్శి కమల్ కిశోర్, కోశాధికారి రమేశ్ తదితరులు ఉన్నారు.