ఖలీల్‌వాడి/వినాయక్‌నగర్, ఫిబ్రవరి 11: ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం హల్చల్ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, సిబ్బందిపై నోరు పారేసుకోవడంతో ఆయనపై కేసు నమోదైంది. హరిచరణ్ మార్వాడీ స్కూల్లోని పోలింగ్ బూత్ నుంచి బీజేపీ అభ్యర్థిని బయటకు పంపించారనే సమాచారంతో అర్వింద్ అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు నిలువరిస్తుండగా, ఎస్సై నారాయణపై తిట్ల దండకం మొదలెట్టారు.
‘పోలీసోడికి ఒళ్లు బలిసిందా..? యూజ్లెస్ ఫెలోస్. కళ్లు నెత్తికి ఎక్కినయా? ఏమనుకుంటున్నారు. క్యాండిడేట్‌ను బయటికి పంపుతారా?’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. తన అనుచరులతో కలిసి అర్వింద్ పోలింగ్ బూత్‌లలోకి దూసుకెళ్లారు. ‘ఎవడాడు..’ అంటూ విధుల్లో ఉన్న సిబ్బందిపై మరోసారి రెచ్చిపోయారు. ఓ వర్గానికి చెందిన మహిళలను ఉద్దేశిస్తూ బుర్ఖాలు తొలగించి ఓట్లు వేయించాలని అక్కడున్న వారికి హుకూం జారీ చేశారు. అయితే, ఎన్నికల విధుల్లో ఉన్న తమను దుర్భాషలాడడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రలోకి చొచ్చుకెళ్లాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అర్వింద్‌పై వన్‌టౌన్ ఠాణాలో కేసు నమోదైంది.