ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటం ఫలించింది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం ఆమె చేసిన ఉద్యమానికి ఫలితం దక్కింది. ప్రతిష్టాత్మక మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు సభ ముందుకు రావడంతో ఎమ్మెల్సీ కవితపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. మహిళల హక్కుల కోసం ఆమె కొన్నేళ్లుగా గళమెత్తారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశారు. దేశ రాజధానిలో నిరసన దీక్షలు నిర్వహించారు. జాతీయ మహిళా నేతలను ఒకచోటుకు చేర్చి కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం ప్రతిష్టాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. కవితక్క పోరాట ఫలితమే ఈ బిల్లు అని బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు ఎమ్మెల్సీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
– నిజామాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటం ఫలించింది. మహిళా రిజర్వేషన్ల కోసం గత కొన్నేండ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న కవిత శ్రమకు ఫలితం దక్కింది. చట్టసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ అమలు కోసం ఎట్టకేలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఇందుకు కవిత చేసిన పోరాట ఫలితాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో లోక్‌సభ సభ్యురాలిగా, ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలిగా ఏ పదవిలో ఉన్నప్పటికీ మహిళా లోకానికి చట్ట సభల్లో సరైన ప్రాతినిధ్యం దక్కాలని ఆలోచన చేసి అందుకు తగ్గ ప్రణాళికతో ఉద్యమాన్ని నడిపించారు. హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా నిరసనలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా పేరొందిన మహిళా నేతలను ఒక్కచోటికి తీసుకువచ్చి వారితో చేతులు కలిపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా లేఖలు సంధించడం ద్వారా చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం అవసరాన్ని కల్వకుంట్ల కవిత గుర్తుచేశారు. ఇలా వరుసగా ఎమ్మెల్సీ కవిత చేసిన పోరాటాల ఫలితంగా సెప్టెంబర్ 19న కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి కారణమైందంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ కవిత పోరాటం ఎనలేనిది. రాష్ట్రసాధన ఉద్యమంలో నాటి టీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచి మహిళా లోకాన్ని ఏకతాటిపైకి తెచ్చారు. తెలంగాణ జాగృతి పేరిట సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యాన్ని రగిలించారు. రోడ్డెక్కి అనేక ధర్నాలు, రాస్తారోకోలు ఒకటేమిటి నాటి సమైక్య పాలకులను గజగజ వణికించారు. గులాబీ దళపతి కేసీఆర్ పిలుపునిచ్చిన ప్రతి ఉద్యమంలోనూ పాలుపంచుకొని తన సత్తా చాటారు. తనతోపాటు జాగృతి సైనికులను వెంటేసుకొని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను తనదైన శైలిలో రగిలించారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 2014లో ఎంపీగా గెలుపొందిన తర్వాత అదే స్థాయిలో లోక్‌సభలో గళం వినిపించారు. కశ్మీర్ పండిట్ అంశంపై లోక్‌సభలో కవిత చేసిన ప్రసంగానికి ప్రశంసలు దక్కాయి. ఉత్తమ పార్లమెంటేరియన్‌గానూ నిలిచి అందరి మన్ననలు పొందారు. పసుపు బోర్డు అంశంపైనా ఐదేండ్లపాటు అలుపెరగని పోరాటాన్ని నడిపించారు. కేంద్రమంత్రులను, ప్రధాని నరేంద్ర మోదీని అనేకమార్లు కలిసి విన్నవించారు. పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను చాటిచెప్పారు. ఇలా అడుగడుగునా ఉద్యమాలు, పోరాటాలతో ప్రజల కోసం పాటుపడిన కల్వకుంట్ల కవిత తాజాగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై పిడికిలెత్తి నినదించి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం విశేషం.
పార్టీలకు అతీతంగా మహిళా లోకాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత కల్వకుంట్ల కవితకే దక్కుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈ ఏడాది ప్రారంభంలోనే నిర్వహించిన నిరసన కార్యక్రమం చరిత్రపుటల్లో నిలిచిపోనున్నది. అనేక పార్టీలకు చెందిన ఎంపీలు, మహిళా నాయకులు పాల్గొని చట్టసభల్లో తమ వాటా కోసం డిమాండ్ చేశారు. ఇందుకు కవిత ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమమే చక్కని వేదికగా నిలిచింది. ఏండ్లుగా కవిత చేస్తున్న డిమాండ్‌కు సర్వత్రా మద్దతు పలుకడంతోపాటు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల కోసం మహిళల్లో డిమాండ్ పెరగడంతో కేంద్రం ఈ అంశంపై ఆలోచన చేయడానికి ఉపకరించింది. ఇందుకు కవిత చేసిన కృషి, పట్టుదల ఎంతో ఉందన్నది రాజకీయ విశ్లేషకుల భావన. పలు జాతీయ మీడియాల్లోనూ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అనేక చర్చా వేదికల్లో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టి చెప్పారు. దేశంలో మహిళా రిజర్వేషన్ అమలు ఆవశ్యకతను వాడవాడలా చాటిచెప్పారు. అంతేకాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా ప్రసంగించారు. చట్టసభల్లో తమ ప్రాతినిధ్యంపై ఉద్యమిస్తున్న వేళ.. కేంద్ర సర్కారు దిగొచ్చి నారీ శక్తి వందన్ అధినియం పేరుతో బిల్లును ప్రవేశపెట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఢిల్లీ దీక్షలకు దిగొచ్చిన కేంద్రం..
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించి చిత్తశుద్ధిని చాటుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పించేందుకు విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. చట్టసభల్లోనూ సమాన ప్రాధాన్యత దక్కాలని అసెంబ్లీలో తీర్మానం సైతం చేశారు. అందులో భాగంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఢిల్లీ దీక్షలో మేమంతా పాల్గొని కేంద్ర సర్కారు తీరును ఎండగట్టాం. ఇప్పుడు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి కవితక్క కృషి కూడా కారణం.
– సుమనా రెడ్డి, ఇందల్వాయి
ఏకతాటిపైకి తెచ్చిన కవితక్క.. ఆలస్యంగానైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం ఆహ్వానిస్తున్నాం. దీనంతటికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటాలేనని చెప్పకతప్పదు. మారుతున్న సమాజంలో మహిళల పాత్రను గుర్తించి వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం అవసరమని ఎలుగెత్తి చాటారు. ఇందుకోసం చేసిన పోరాటాల ఫలితమే కేంద్రంలో వచ్చిన ఈ కదలికగా చూస్తున్నాను.
– విశాలిని రెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటమే కారణం. గత కొన్నేళ్లుగా రాజీలేని పోరాటం ద్వారా దేశ వ్యాప్తంగా కవితక్క ఉద్యమం నడిపించారు. ఇందులో భాగంగానే కేంద్రంలో కదలిక వచ్చింది. నిరంకుశ కేంద్ర ప్రభుత్వంలో ఈ అంశంపై ఆలోచన రావడానికి కవిత చేసిన ఉద్యమమే ముఖ్య కారణంగా నిలిచింది. యావత్ మహిళల తరఫున కవితక్కకు కృతజ్ఞతలు, అభినందనలు.
– విజయలక్ష్మి, బీఆర్ఎస్ కార్మిక నాయకురాలు
నిజాంసాగర్, సెప్టెంబర్19: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే సాధ్యమైంది. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పట్టుదలతో ఎంతో మందిని కూడగట్టి పోరాటం చేశారు. ఎమ్మెల్సీ కవితకు మహిళలందరి తరఫున కృతజ్ఞతలు.
– దఫేదార్ శోభారాజు, జడ్పీ చైర్పర్సన్, కామారెడ్డి
ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 19: నగరంలోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో మంగళవారం భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి విద్యార్థినులు, మహిళలు, జాగృతి నాయకులు క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ కాలనీ కమాన్ నుంచి క్యాంపు కార్యాలయం వరకు మహిళలు, విద్యార్థినులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందన్నారు. మహిళల హక్కుల కోసం గళం వినిపించడంలో ఎమ్మెల్సీ కవిత ఎప్పుడూ ముందుంటారని, మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా విశేషంగా కృషి చేస్తున్న కవితకు ధన్యవాదాలు తెలిపారు. కవిత పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళా ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యతపై మొదటి నుంచి పోరాడుతున్న కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది యావత్ మహిళాలోకం విజయంగా అభివర్ణించారు. కార్యక్రమంలో మహిళా నాయకులు అపర్ణ, సుమనారెడ్డి, విశాలినిరెడ్డి, భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు, నరాల సుధాకర్, లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ యువనాయకులు చిన్నుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 19: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా శుభాకాంక్షలు తెలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పట్టుదలతో ఎంతో మంది మద్దతు కూడగట్టి పోరాటం చేశారని, ఎమ్మెల్సీ కవిత పోరాట కృషితో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, ముఖ్యంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటూ ఎమ్మెల్సీ కవితకు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.