గాంధారి, మే 19: మండలంలోని కామారెడ్డి – బాన్సువాడ ప్రధాన రహదారిపై పొతంగల్ కలాన్ స్టేజీ నుంచి చందానాయక్ తండా వరకు రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రహదారిపై ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కామారెడ్డి – బాన్సువాడ ప్రధాన రహదారిపై సుమారు ఐదు కిలోమీటర్ల వరకు ఆరు నెలల క్రితం కంకర వేశారు.
దానిపై తారు వేయకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. కంకర ఉండడంతో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆరు నెలల్లో ఈ రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురై మరణించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.