మోర్తాడ్, జనవరి 12: మోర్తాడ్ మండలం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. గతంలో ఎన్నడూ జరగని విధంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో ముందుకుసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతిలో జిల్లాలోనే ఉత్తమ మండలంగా ఎంపికైంది. మరోసారి ఉత్తమ అవార్డు అందుకునేదిశగా మండలంలో అభివృద్ధి, సంక్షేమ పనులు జోరుగా సాగుతున్నాయి.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మిత్రుల సహకారంతో రూ.కోటిన్నర ఖర్చుతో మోర్తాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లో ఆక్సీజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలకు ఆక్సీజన్ సిలిండర్లను మోర్తాడ్ నుంచి సరఫరా చేసే ఏర్పాట్లు చేశారు. సుమారు వంద వరకు సిలిండర్లను సిద్ధంగా ఉంచారు. అప్పట్లో కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు ఆక్సీజన్ అందుబాటులో ఉండాలని మంత్రి వేముల, అతడి మిత్రుల సహకారంతో ఆక్సీజన్ ప్లాంట్‌తో పాటు ఐఈయూ బెడ్లు, ఆక్సీజన్ బెడ్లు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేయ డం అభినందనీయమని మండల వాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
సుంకెట్, గాండ్లపేట్, పాలెం గ్రామాల వద్ద పెద్దవాగులో చెక్‌డ్యాములను నిర్మించడంతో పెద్దవాగు ఆయకట్టు గ్రామాలన్నింటికీ సాగునీటి సమస్య తీరింది. సుంకెట్ వద్ద రూ.9కోట్లు, గాండ్లపేట్‌లో రూ.5.50కోట్లు, పాలెం వద్ద రూ.8.88కోట్లతో చెక్‌డ్యాములను నిర్మించారు. వీటి నిర్మాణంతో పెద్దవాగు ఆయకట్టు గ్రామాలైన సుంకెట్, మోర్తాడ్, గాండ్లపేట్, దొన్కల్, ధర్మోరా, పాలెం, శెట్పల్లి గ్రామాలకు సాగునీరు అందుతున్నది. చెక్‌డ్యాముల నిర్మాణంతో భూగర్భజలాలు కూడా పెరగడంతో తాగునీటి సమస్యలు కూడా దూరమయ్యాయి.
మండలంలోని వడ్యాట్, దోన్పాల్, ధర్మోరా గ్రామాలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి సబ్స్టేషన్లను మంజూరుచేయించారు. వీటి నిర్మాణాలు పూర్తి కావడంతో పాటు, పాలెం, సుంకెట్ సబ్స్టేషన్లలో కెపాసిటర్లను మంజూరు చేయడంతో మండలంలో విద్యుత్ సమస్యలు పూర్తిస్థాయిలో దూరమయ్యాయి. ఏ గ్రామంలో కూడా లోవోల్టేజీ సమస్య తలెత్తడం లేదు.
మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. పనులను సక్రమంగా చేపట్టడంతో 2022 సంవత్సరంలో జిల్లాలోనే ఉత్తమ మండలంగా మోర్తాడ్ ఎంపికైంది. అదే స్ఫూర్తితో తిరిగి ఈ సంవత్సరం కూడా పనులు జోరుగా సాగుతున్నాయి. చెత్తసేకరణ, హరితహారం, నర్సరీల ఏర్పాటు పనులు జోరందుకున్నాయి. గ్రామాల్లో ఎటుచూసినా పరిశుభ్రత, పచ్చదనం కనిపిస్తున్నది.
అభివృద్ధిలో దూసుకుపోతున్న మోర్తాడ్‌కు సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఇప్పటికే జాతీయరహదారి నుంచి మోర్తాడ్ గ్రామం వరకు రూ.3.50కోట్లతో సెంట్రల్‌లైటింగ్ పనులుపూర్తవగా.. మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం తహసీల్ కార్యాలయం నుంచి పాలెం ఎక్స్ రోడ్డు వరకు రూ.4.50కోట్లతో సెంట్రల్‌లైటింగ్ పనులు చేపడుతున్నారు. అంతే కాక మండలంలోని ప్రతి గ్రామానికీ మిలమిల మెరిసే తారురోడ్డు సౌకర్యం కూడా ఏర్పడింది.
మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి సహకారం మరవలేనిది. గ్రామాల్లోని సమస్యలు తెలుసుకొని సమస్యను పరిష్కరించడంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. తాగు,సాగునీటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి, రోడ్లు బాగుపడ్డాయి. పల్లెప్రగతి కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించడంతో మోర్తాడ్ జిల్లాలో ఉత్తమ మండలంగా ఎంపికైంది. అదే స్ఫూర్తితో మరింత ముందుకుసాగుతాం.
– శివలింగు శ్రీనివాస్, ఎంపీపీ, మోర్తాడ్