నిజామాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కంఠేశ్వర్ : తొమ్మిది నెలలు తల్లి కడుపులో బిడ్డను మోసినట్లుగానే రైతులు తొమ్మిది నెలలు కష్టపడి పసుపు పంట పండిస్తారు. ఎన్నో ఆశలతో పంట తీసుకుని మార్కెట్‌కు వస్తే ఇక్కడ అంతా సిండికేట్ అయి రైతులను నిండా ముంచుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పసుపు రైతులను మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.15 వేల మద్దతు ధర ఇస్తామన్న బీజేపీ చట్టబద్ధత లేని పసుపుబోర్డు ఇచ్చి మోసం చేసిందని, రూ.12 వేల మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడ్డారు. రైతులకు కనీస మద్దతు ధర దక్కే వరకూ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలప్పుడు కాంగ్రెస్ చెప్పినట్లు రూ.12 వేల కంటే ధర తక్కువ వచ్చిన రైతులకు ఆ మేరకు ప్రయోజనం కల్పించాలన్నారు. ఏ ధరకు పసుపు పంటను అమ్ముకున్నా మిగులు లెక్క గట్టి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే మార్చి 1న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత శనివారం నిజామాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చి పసుపు కొనుగోళ్లను పరిశీలించారు. పసుపు రైతుల గోడు విన్న ఆమె.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హమాలీలతో మాట్లాడి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి..
ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, పసుపు రైతులకు రూ.12 వేల మద్దతు ధర ఇస్తామని చెప్పిందని కవిత గుర్తు చేశారు. అంత కంటే తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు రూ.12 వేలు భర్తీ చేసి ఆదుకుంటామని రేవంత్ రెడ్డి, రాహుల్‌గాంధీ చెప్పారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కవిత డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డికి అవగాహన లేకపోవడంతో రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నదన్నారు. ఏపీ నీళ్లను ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారని మండిపడ్డారు. చంద్రబాబుకు గురుదక్షిణగా రేవంత్‌రెడ్డి నీళ్లను అప్పగిస్తున్నారా? అని నిలదీశారు. ఏపీ నీళ్ల దోపిడీపై కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే కేసీఆర్ ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారని, కేసులు కూడా వేశారని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా కామెంట్లు చేయడం, నోరు ఉందని ఎటు పడితే అటు ఒర్రుడే కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం రేవంత్‌రెడ్డికి చాతనైతలేదన్నారు.
పసుపుబోర్డుకు చట్టబద్ధతేదీ?
పసుపుబోర్డు వచ్చినా రైతులకు ఫాయిదా లేదని కవిత అన్నారు. కేంద్రం పేరుకే గెజిట్ జారీ చేసి పసుపుబోర్డు ఏర్పాటు చేసిందని, దానికి చట్టబద్ధత ఏదని ప్రశ్నించారు. బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయన్నారు. దాని వల్ల స్థానికంగా పసుపునకు మంచి రేటు వస్తుందని చెప్పారు. పసుపుబోర్డుకు చట్టబద్ధత కోసం పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. పసుపు పండించి దీనావస్థలో ఉన్న రైతులను తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. శివరాత్రి తర్వాత మహారాష్ట్ర నుంచి మార్కెట్‌కు పసుపు వస్తుందని, అప్పుడు ధర మరింత తగ్గే ప్రమాదముందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రైతులంతా పోరాటం చేసే సమయం ఆసన్నమైందన్నారు. పసుపు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ చెప్పినట్లు కనీస మద్దతు ధర రూ.15వేలు అమలయ్యేలా కేంద్రంపై పోరాడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రూ.12 వేల కోసమూ ఉద్యమిస్తామంటూ రైతులకు ధైర్యం చెప్పారు. మాజీ మేయర్ నీతూకిరణ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామ్‌కిషన్‌రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు విశాలినిరెడ్డి, సుమనారెడ్డి, చింతా మహేశ్, తెలంగాణ శంకర్, శ్రీనివాస్‌గౌడ్, పులి జయపాల్ తదితరులు కవిత వెంట ఉన్నారు.
ఇదేం ధర.. ఇదేం లెక్కా?
నిజామాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన ఎమ్మెల్సీ కవితతో రైతులు, కూలీలు తమ గోడు వెల్లబోసుకున్నారు. వేస్ట్ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని, రైతులను పట్టించుకుంటలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి వచ్చిన రైతులతో పాటు నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి పసుపు తీసుకొచ్చిన రైతులు తమ ఇబ్బందులను వివరించారు. బీజేపీ ఎన్నికలప్పుడు చెప్పినట్లు రూ.15 వేలు మద్దతు ధర అందుతుందా? అని కవిత ప్రశ్నించగా, రైతులంతా కేంద్ర సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులతో కవిత మాటామంతి ఇలా..
కవిత: నమస్తే రైతన్నలు. ఎట్లున్నరు. పసుపు పంటకు ధర వస్తున్నదా?
రైతులు: అక్కా మాది కమ్మర్పల్లి. మా తాతల కాలం నుంచి పసుపు పండిస్తున్నం. ఇత్తనం నుంచి డ్రమ్ము పట్టే దాకా రైతులకు కష్టాలే మోపైనాయి. కనీస ధర అస్తలేదు. అడిగినా ఎవ్వలూ పట్టించుకుంటలేరు.
బీజేపీ వాళ్లు పసుపుబోర్డు తెచ్చామంటున్నారు కదా. లాభం జరగలేదా?
రైతులు: యాడ జరిగింది. బోర్డు తెచ్చామన్నారు. అది బోర్డుకే పరిమితమైంది. పసుపుబోర్డు యాడుందో. అదేందో ఏమో మాకు తెల్వదు. బోర్డు వచ్చింది కదాని ఆశతో ఉన్నం. ధర మంచిగా వస్తుందనుకుంటే దరిద్రంగా మారింది. క్వింటా పసుపునకు రూ.8 వేల ధర పెట్టడం పచ్చి మోసం.
గిట్టుబాటు కాదు కదా.. ఎట్లా భరిస్తున్నరు నష్టాలను?
రైతులు: ఏం జేసుడో ఏమో ఏం అర్థమైతలేదు. రూ.8వేలు ఇస్తే మాకు ఏ లెక్కన సరిపోతది. ఖర్చులకు సుతా సరిపోవు. మార్కెట్లో వ్యా పారులంతా సిండికేట్ అయ్యిండ్రు. పది మంది మోపైతుండ్రు. ముందే ఒక ధర అనుకుంటున్నారు. రైతుల కుప్పల వద్దకు వచ్చి అదే చెబుతున్నారు.
సిండికేట్ వ్యాపారులపై కలెక్టర్‌కు ఏమైనా ఫిర్యాదు జేసిండ్రా.
రైతులు: వాళ్లకు ఫిర్యాదు జేసినా పట్టించుకోరు. సిండికేట్ గాళ్లతోనే రైతులకు నష్టాలు మోపవుతున్నాయి. నాలుగైదు రోజులు వేచి చూస్తే కూ డా ధర రాక ఎక్కువ రోజులు మార్కెట్లో ఉండలేక రైతులు ఉట్టి చేతులతో వెళ్లలేక ఎంతకో కొంతకు దళారులకు అప్పగించాల్సి వస్తున్నది.
శివరాత్రి నాటికి ధర పెరుగుతదంట కదా.. నిజమేనా?
రైతులు: శివరాత్రికి పసుపు బాగా అత్తది. ఇంకా 80 శాతం పంట మార్కెట్‌కు రాలే. రైతులకు భయమైతన్నది. ధర లేక మార్కెట్‌కు అచ్చుడెందుకో అని బాధ పడుతున్నరు. శివరాత్రికి మహారాష్ట్ర నుంచి కూడా పసుపు అత్తే ధర మరింత పడిపోతది.
ఎంత ధర ఉన్నా రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ వాళ్లు చెప్పిండ్రు.
అడుగుదామా? కేంద్రం మీద రూ.15వేల కోసం కొట్లాడుదామా?
రైతులు: జై శ్రీరాం అనుడు తప్పా ఏం చేస్తలేరు. అంతా ఉత్త కథనే. రెండు సార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ ఒక్కసారి కూడా మార్కెట్‌కు రాలేదు. ఎన్నికలప్పుడు వస్తుండ్రు. పోతుండ్రు. ఏవేవో చెబుతుండ్రు.
ఏమవ్వా బాగున్నవా? ఎట్లున్నది మార్కెట్ పరిస్థితి.
కూలీ దొరుకుతున్నదా?
మహిళా కూలీ: ఐదు రూపాయల బువ్వ దొరుకుతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సక్కగా ఉండే. ఇప్పుడు ఉపాసం ఉంటున్నం.
మేము ఇప్పుడు లేము కదా. సర్కారు మారింది కదా. మార్పు అన్నారు. మార్పు జరిగింది. అన్నం బంద్ చేసిండ్రు.
రైతులు: అప్పుడే బాగుండే. సర్కార్ దవాఖానాల కూడా బువ్వ అందుతుండే. ఇప్పుడు ఎవ్వలకు అన్నం దొరుకుతలేదు.