ఖలీల్‌వాడి, జూలై 8: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై మంగళవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న మోసానికి నిరసనగా బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈనెల 17న రైల్ రోకో నిర్వహించనున్నట్లు తెలిపారు.
బిల్లును ఆమోదించకపోతే భవిష్యత్తులో నిరవధికంగా రైలురోకోను నిర్వహిస్తామని హెచ్చరించారు. బీజేపీ డీఎన్ఎలోనే బీసీ వ్యతిరేకత ఉన్నదన్నారు. రైలు రోకోకు మద్దతు, బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో అన్ని పార్టీలకు లేఖలు రాస్తానని తెలిపారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చి రెండేండ్లు కావస్తున్నా వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. తాము చేసిన పోరాటాలు, ఉద్యమాలతో దిగొచ్చిన ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించి చేతులు దులుపుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
2014లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాహుల్‌గాంధీ ఆకస్మాత్తుగా బీసీలపై ప్రేమను ఒలకపోయడం మొదలుపెట్టారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ చేపట్టిన సర్వేలో బీసీలు కేవలం 46 శాతం మాత్రమే ఉన్నట్లు తేల్చారని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో హాఫ్ సెంచరీ చేశారని, రాష్ట్రంలో తక్కువ, ఢిల్లీలో ఎక్కువగా ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని పరిరక్షించడమే కాకుండా అభివృద్ధి చేయడంలో ముందుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్, ఒడిశాలో నవీన్ పట్నాయక్, తమిళనాడులో జయలలిత వంటి వారి నాయకత్వంలోని ఆయా పార్టీల ద్వారా ప్రజలకు లబ్ధి జరిగిందన్నారు.