ఖలీల్‌వాడి, మే 10: పైసల కన్నా ప్రాణాలే విలువైనవని, ఒక ప్రాణాన్ని కాపాడితే కోటి రూపాయలు సంపాదించినట్లేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యెండల టవర్స్ వద్ద కొత్తగా ఏర్పాటుచేసిన ప్రుడెన్స్ దవాఖానను ఆమె.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. హైదరాబాద్ తరహాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలను నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. పేదలను అదుకోవడంలోనూ ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. అనంతరం ప్రుడెన్స్ దవాఖాన యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు అపర్ణ భర్త శ్రీనివాస్ ఇటీవల మృతిచెందగా, బాధిత కుటుంబాన్ని కవిత పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.