Ganesh Chaturthi | కామారెడ్డి/ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 17 : వినాయక చవితి పండుగ అంటేనే అందరిలో ఉత్సాహం. భారీ విగ్రహాలు.. వీధి వీధినా మండపాలు.. ఆకర్షణీయమైన సెట్టింగులు.. ఉదయం నుంచి విశేష పూజలు, భక్తుల దర్శనాలతో అర్ధరాత్రి వరకు సందడే సందడి. విఘ్నాలు తొలగించే వినాయకుడు నేడు (సోమవారం) కొలువుదీరనుండగా, విభిన్న ఆకృతుల్లో గణనాథుడు పూజలందుకుంటాడు. ఏటేటా మండపాలు, విగ్రహాల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిని నిమజ్జనం చేసినప్పుడు నీరు కలుషితమవుతున్నది. గతంలో మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేవారు. కానీ నేడు యువత పోటీపడి ఆకర్షణీయమైన రంగులతో ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ విగ్రహాల విషయంలో ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గడం లేదు.
దీంతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోయింది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి విగ్రహాలే శ్రేష్ఠమని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం సైతం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. మట్టి విగ్రహాలనే ఏర్పాటుచేసి పూజించాలని ప్రోత్సహిస్తున్నది. పలు గ్రామాల్లో మట్టితో తయారుచేసిన సామగ్రిని ఇంకా వాడుతున్నారు. పర్యావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజల్లో సైతం క్రమంగా మార్పు కనిపిస్తున్నది. మట్టి ప్రతిమలకు ఆదరణ పెరగడంతో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసి ప్రోత్సహిస్తున్నాయి.
రసాయనాలతో కాలుష్యం..
విగ్రహాలకు వేసిన పేయింట్ నుంచి విడుదలైన వాయువులు గాలిలోని నత్రజని, ఆక్సిజన్‌తో కలిసి ఓజోన్ వాయువు ఏర్పడుతుంది. ఇది ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. పేయింట్లలో కాడ్మియం, టైటానియం కణాలు ఉంటాయి. ఇవీ విషపూరితమైనవే. వీటితో వాయు కాలుష్యం ఏర్పడి వర్షాలపై ప్రభావం చూపుతుంది. దీంతో కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. విగ్రహాల తయారీకి వినియోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తోనూ అనేక దుష్ప్రభావలు ఉంటాయి. విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా నీరు కలుషితమవుతున్నది. ఈ నీటిని తాగిన వారికి క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. జల చరాలకు కూడా ముప్పు ఉంటుంది. విగ్రహాల తయారీకి మట్టిని వినియోగిస్తే పర్యావరణ సమతుల్యం ఏర్పడుతుంది.
నవరాత్రులను సంతోషంగా జరుపుకోవాలి : స్పీకర్
బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 17: ఉమ్మడి జిల్లా ప్రజలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఏకదంతుడి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నాలకు అధిపతి వినాయకుడని, ఏ కార్యక్రమం చేపట్టినా తొలిపూజ అందుకునేది గణనాథుడేనని పేర్కొన్నారు. గణేశ్ నవరాత్రులను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
మార్కెట్లో కొనుగోళ్ల సందడి..
వినాయక చవితి సందర్భంగా మార్కెట్లు సందడిగా మారాయి. విభిన్న రూపాల్లో వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. వీధి వ్యాపారులు పూజా సామగ్రితోపాటు పూలు, పండ్ల దుకాణాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతోపాటు ఆయా పట్టణాల్లో రోడ్లన్నీ కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. గ్రామాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు భక్తులు పట్టణాలకు తరలి వస్తున్నారు. భారీ విగ్రహాలను కొనుగోలు చేసి ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. దీంతో ప్రధాన రోడ్లన్నీ ఆదివారం అర్ధరాత్రి వరకు సందడిగా కనిపించాయి.
నవరాత్రుల పూజలు..
ఏకదంతుడిని తొమ్మిది రోజులపాటు (నవరాత్రులు) పూజిస్తారు. ఎందుకంటే మానవుడికి సిద్ధి, బుద్ధి కలుగాలంటే ఒక్కరోజు పూజచేస్తే సరిపోదు. నవరాత్రులు ఆరాధన చేస్తే విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మొదటి రోజు 21 దళాలతో పత్రి పూజ, రెండో రోజు అష్టోత్తర శతనామావళి పూజ, మూడో రోజు పుష్పార్చన, నాల్గో రోజు సహస్రనామార్చన, ఐదో రోజు కల్యాణోత్సవం, ఆరోరోజు విశేషమైన పడిపూజ, ఏడోరోజు గణపతి పూజ, హోమం, ఎనిమిదో రోజు సహస్ర మోదక పూజ, తొమ్మిదో రోజు ముగింపు పూజ చప్పన్ భోగ్ (56 రకాల పిండి వంట కాలతో నైవేద్యం), పదో రోజు ఉధ్వాసన పూజ చేసి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.